
Farm Laws: సాగుచట్టాల రద్దు నేపథ్యంలో రైతు సంఘాల భేటీ.. ఎజెండా ఇదే!
భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించనున్న సంయుక్త కిసాన్ మోర్చా
దిల్లీ: సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమం చేపట్టడంతో దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం.. చివరకు వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణను చర్చించడంలో భాగంగా రైతు సంఘాలు నేడు దిల్లీలో సమావేశమయ్యాయి. అన్నదాతల ఆందోళనలకు నాయకత్వం వహిస్తోన్న సంయుక్త కిసాన్ మోర్చా(SKM) ఆధ్వర్యంలో వివిధ రైతు సంఘాల నేతలు నేడు దిల్లీలో భేటీ అయ్యారు. ఆందోళనల కొనసాగింపు, కనీస మద్దతు ధర (MSP)కు చట్టబద్ధత కల్పించడం, విద్యుత్తు సవరణ చట్టాల రద్దు వంటి అంశాలను భేటీలో చర్చిస్తున్నట్లు భారతీయ కిసాన్ యూనియన్ (BKU) నేత రాకేశ్ టికాయిత్ పేర్కొన్నారు.
వీటితోపాటు ఆందోళనల సందర్భంగా రైతులపై నమోదైన కేసుల ఎత్తివేత, మరణించిన అన్నదాతలకు పరిహారం, అక్టోబర్ 3న జరిగిన లఖింపూర్ ఖేరీ వంటి ఘటనలను కూడా సమావేశంలో చర్చిస్తున్నట్లు రాకేశ్ టికాయిత్ వెల్లడించారు. సింఘూ సరిహద్దులో ఏర్పాటు చేసిన సమావేశంలో వివిధ రైతు సంఘాల నేతలు పాల్గొని చర్చిస్తున్నారు. భేటీ అనంతరం తదుపరి కార్యాచరణను వెల్లడిస్తామని ఎస్కేఎం నేతలు పేర్కొన్నారు.
ఇదిలాఉంటే, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ నెల 29నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ఈ ప్రక్రియను పూర్తిచేస్తామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ చట్టాల రద్దుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం 24న జరిగే కేంద్ర కేబినెట్ భేటీలోనే వ్యవసాయ చట్టాల రద్దుకు సంబంధించి తీర్మానం చేయనున్నట్లు సమాచారం.