Published : 29/10/2021 19:58 IST

Indian Vaccines: భారత వ్యాక్సిన్‌ రంగంపై పూర్తి విశ్వాసం: WHO

అత్యంత నాణ్యమైన టీకాలను భారత్‌ ఉత్పత్తి చేస్తోందన్న డబ్ల్యూహెచ్‌ఓ

జెనీవా: స్వదేశీ వ్యాక్సిన్‌ సంస్థ భారత్‌ బయోటెక్‌ రూపొందించిన కొవాగ్జిన్‌ టీకాను అత్యవసర వినియోగ జాబితాలో (ఈయూఎల్‌) చేర్చేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం ఇచ్చే ప్రక్రియ ఆలస్యమవుతోంది. దీంతో చైనా తయారు చేసిన టీకాల (సినోఫార్మ్‌, సినోవాక్‌ )పై సరైన సమాచారం లేకున్నా వాటికి ఎలా అనుమతి ఇచ్చారనే ప్రశ్నలు డబ్ల్యూహెచ్‌ఓకు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. అత్యంత నాణ్యమైన వ్యాక్సిన్‌లను తయారు చేసే భారత టీకా రంగంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని స్పష్టం చేసింది. తమ సాంకేతిక నిపుణుల బృందానికి కావాల్సిన సమాచారంపై భారత్‌ బయోటెక్‌ వేగంగా స్పందిస్తోందని.. వచ్చే వారంలోనే కొవాగ్జిన్‌ ఈయూఎల్‌పై ఓ ప్రకటన వెలుబడే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేసింది.

భారత్‌ బయోటెక్‌ రూపొందించిన ‘కొవాగ్జిన్‌’ టీకాను అత్యవసర వినియోగ జాబితాలో చేర్చాలని ఆసక్తి వ్యక్తం చేస్తూ (EOI) ఏప్రిల్‌ 19న ప్రపంచ ఆరోగ్య సంస్థకు సమాచారం అందించింది. దీనిపై ఇప్పటికే పలుమార్లు డబ్ల్యూహెచ్‌ఓ నిపుణుల కమిటీ భేటీ అయ్యింది. తాజాగా అక్టోబర్‌ 18న భేటీ అయిన డబ్ల్యూహెచ్‌ఓ నిపుణుల కమిటీ మరింత సమాచారం కావాలని భారత్‌ బయోటెక్‌ను కోరినట్లు వెల్లడించింది. దీంతో చైనా తయారు చేసిన సినోఫార్మ్‌, సినోవాక్‌ వ్యాక్సిన్‌లకు సంబంధించి సరైన సమాచారం లేనప్పటికీ వాటికి అనుమతి ఇవ్వడంపై ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. దీనిపై స్పందించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ మరియాంగెలా సిమావో.. అనుమతి విషయంపై భారత్‌ బయోటెక్‌తో రోజువారీగా సంప్రదింపులు జరుపుతూనే ఉన్నామని అన్నారు. ఈ సందర్భంగా భారత్‌కు చెందిన మరో వ్యాక్సిన్‌ సంస్థ (సీరం ఇన్‌స్టిట్యూట్‌)ను పరోక్షంగా ప్రస్తావిస్తూ కేవలం 30 రోజుల్లోనే ఆ టీకాకు అనుమతి ప్రక్రియను పూర్తి చేశామని గుర్తుచేశారు.

భారత్‌ టీకా రంగంపై పూర్తి విశ్వాసం..

వ్యాక్సిన్‌లకు వేగంగా అనుమతులు ఇవ్వడం పక్కనబెడితే.. భారత వ్యాక్సిన్‌ రంగంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని డబ్ల్యూహెచ్‌ఓ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ మరియాంగెలా సిమావో స్పష్టం చేశారు. ప్రపంచంలో వివిధ రకాల వ్యాక్సిన్‌లను తయారు చేసే భారత్‌.. అత్యంత నాణ్యతతో కూడిన టీకాలను ఉత్పత్తి చేస్తోందని అభిప్రాయపడ్డారు. ఎమర్జెన్సీ యూజ్‌ లిస్టింగ్‌ (EUL) ప్రక్రియ అనేది అత్యంత పారదర్శకంగా జరుగుతుందని, ఇందులో ఎలాంటి రహస్యమూ ఉండదని పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వినియోగించే వ్యాక్సిన్‌లు ఏ దేశం తయారు చేస్తుందనే విషయాన్ని ప్రముఖంగా చూడదని.. కేవలం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనే విషయంపై ఆధారపడి మాత్రమే అనుమతులు ఉంటాయని అన్నారు.

చైనా వ్యాక్సిన్లపైనా సమాచారం అడిగాం..

చైనా వ్యాక్సిన్లకు అనుమతి ఇచ్చే సమయంలోనూ వారి నుంచి అదనపు సమాచారాన్ని కోరామని డబ్ల్యూహెచ్‌ఓ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ సిమావో పేర్కొన్నారు. సాంకేతిక నిపుణుల కమిటీ భేటీ అయిన నెల తర్వాత ఒక చైనా వ్యాక్సిన్‌కు అనుమతి ఇచ్చామని.. మరో వ్యాక్సిన్‌కు ఆరు వారాల సమయం పట్టిందని చెప్పారు. ప్రస్తుతం భారత్‌ బయోటెక్‌తో పాటు మరో ఎనిమిది వ్యాక్సిన్‌ల సమాచారాన్ని డబ్ల్యూహెచ్‌ఓ విశ్లేషిస్తోందన్నారు. త్వరలోనే కొవాగ్జిన్‌ అనుమతులపైనా క్లారిటీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఫైజర్‌, ఆస్ట్రాజెనెకా (కొవిషీల్డ్‌), జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌, మోడెర్నా, సినోఫార్మ్ టీకాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర వినియోగ అనుమతులు జారీ చేసింది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని