ram nath kovind: బంగ్లాదేశ్‌లో రాష్ట్రపతి కోవింద్‌కు ఘన స్వాగతం

కోవిడ్‌-19 మహమ్మారి వ్యాప్తి తర్వాత తొలిసారిగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ విదేశీ పర్యటనలో భాగంగా  బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా చేరుకున్నారు.మూడు రోజుల పర్యటన నిమిత్తం

Published : 15 Dec 2021 16:37 IST

ఢాకా: కొవిడ్‌-19 మహమ్మారి వ్యాప్తి తర్వాత తొలిసారి భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ విదేశీ పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా చేరుకున్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం సతీమణి సవితా కోవింద్‌, కుమార్తె స్వాతి కోవింద్‌తో ఢాకా చేరుకున్న రాష్ట్రపతికి ఆ దేశ ఆర్మీ, నేవీ, వైమానిక దళ సిబ్బంది రెడ్‌ కార్పెట్‌ స్వాగతం పలికింది. 21 తుపాకులతో సెల్యూట్‌ చేసి గౌరవించారు. విమానాశ్రయంలో బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్‌ హమీద్‌, ఆయన సతీమణి రషీదా రాష్ట్రపతి దంపతులకు స్వాగతం పలికారు. 1971లో పాకిస్థాన్‌ నుంచి బంగ్లాదేశ్‌కు స్వాతంత్ర్యం లభించగా ప్రస్తుతం ఆ దేశం 50వ స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకొంటోంది. ఈ సందర్భంగా జరిగే 50వ విక్టరీ డే వేడుకలకు గౌరవ అతిథిగా భారత్‌ తరపున రాష్ట్రపతి ప్రాతినిథ్యం వహించనున్నారు.

1971లో జరిగిన ఇండో-పాక్‌ యుద్ధంలో భాగంగా బంగ్లాదేశ్‌కు విముక్తి లభించగా ఆ దేశంతో సన్నిహిత సంబంధాలు ప్రతిబింబించేలా భారత్‌లోనూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రపతి పర్యటన గురించి మంగళవారం బంగ్లాదేశ్‌ విదేశాంగ మంత్రి ఏ.కే.అబ్దుల్‌ మొమెన్‌ విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రపతి కోవింద్‌ పర్యటనను ‘ఉత్సవం’గా పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌ చేరుకున్న రాష్ట్రపతి సవర్‌లోని జాతీయ అమరవీరుల స్మారకాన్ని సందర్శించి బంగ్లాదేశ్‌ విముక్తి యుద్ధం అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం బంగాబంధు మెమోరియల్‌ మ్యూజియాన్ని సందర్శించి బంగాబంధు షేక్‌ ముజిబుర్‌ రెహమాన్‌కు అంజలి ఘటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని