Covid Treatment: కొవిడ్‌ చికిత్స పరిశోధనలో కీలక పురోగతి..!

ఇన్‌ఫెక్షన్‌కు కారణమయ్యే వైరస్‌ పునరుత్పత్తిని అణచివేసే సామర్థ్యమున్న ఔషధ చికిత్సను బ్రిటన్‌, జర్మనీ శాస్త్రవేత్తలు గుర్తించారు.

Published : 30 Oct 2021 01:08 IST

సమర్థవంతమైన ఔషధాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌ను ఎదుర్కొనే వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వచ్చినప్పటికీ చికిత్సకు సంబంధించిన పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందుకోసం ఇప్పటికే అందుబాటులో ఉన్న ఔషధాలపై ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శాస్త్రవేత్తలు మరో పురోగతి సాధించారు. ఇన్‌ఫెక్షన్‌కు కారణమయ్యే వైరస్‌ పునరుత్పత్తిని అణచివేసే సామర్థ్యమున్న ఔషధ చికిత్సను బ్రిటన్‌, జర్మనీ శాస్త్రవేత్తలు గుర్తించారు.

కొవిడ్‌-19కు కారణమయ్యే వైరస్‌ సోకినపుడు కణాల్లో అవి ఎలాంటి చర్యలు, ప్రభావాలను చూపుతున్నాయనే విషయంపై బ్రిటన్‌కు చెందిన యూనివర్సిటి ఆఫ్‌ కెంట్‌తో పాటు జర్మనీకి చెందిన గైథే యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. ఇందులో భాగంగా పెంటోజ్‌ ఫాస్ఫేట్‌ అనే జీవక్రియా మార్గం క్రియాశీలకంగా మారినప్పుడు మాత్రమే సార్స్‌-కోవ్‌-2 కణాల పునరుత్పత్తి వేగంగా జరుగుతున్నట్లు గుర్తించారు. అయితే, వీటిని అణచివేయడంలో బెన్‌ఫో-ఆక్సిథియామిన్‌ ఔషధం సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు బ్రిటన్‌, జర్మనీ నిపుణులు కనుగొన్నారు. తద్వారా ఇన్‌ఫెక్షన్‌కు గురైన కణాలు కరోనా వైరస్‌ కణాలను ఉత్పత్తిని తగ్గించవచ్చని ఓ నిర్ధారణకు వచ్చారు. కొవిడ్‌ చికిత్సకు సంబంధించిన తాజా అధ్యయనం మెటాబోలైట్స్‌ జర్నల్‌లో ప్రచురితమైంది.

వైరల్‌ వ్యాధుల చికిత్సకు రోగనిరోధక శక్తిని అభివృద్ధి చేయడమే అత్యంత ప్రధాన సమస్య కావున విభిన్న లక్ష్యాలతో వీటిపై పరిశోధనలు చేయడం ఎంతో ముఖ్యం. సమర్థవంతమైన కొవిడ్‌ చికిత్స అభివృద్ధి చేయడంలో తాజా అధ్యయనంలో కీలక పురోగతి సాధించినట్లు యూనివర్సిటీ ఆఫ్‌ కెంట్‌కు చెందిన ప్రొఫెసర్‌ మార్టిన్‌ మిషెలీస్‌ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో కొవిడ్‌ చికిత్సా విధానంపై మరింత పురోగతిని సాధిస్తామని ఆశాభావం వ్యక్తంచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని