Bipin Rawat: ప్రభుత్వంపై జనరల్‌ బిపిన్‌ రావత్‌ బావమరిది సంచలన వ్యాఖ్యలు

భారత త్రిదళాధిపతి, దివంగత జనరల్​ బిపిన్​ రావత్​ బావమరిది యశోవర్ధన్​ సింగ్​ సంచలన ఆరోపణలు చేశారు. అనుమతి లేకుండా మధ్యప్రదేశ్​ ప్రభుత్వం తన భూమిని స్వాధీనం చేసుకుందని ఆరోపించారు.....

Published : 16 Dec 2021 01:18 IST

దిల్లీ: భారత త్రిదళాధిపతి, దివంగత జనరల్​ బిపిన్​ రావత్​ బావమరిది యశోవర్ధన్​ సింగ్​ సంచలన ఆరోపణలు చేశారు. అనుమతి లేకుండా మధ్యప్రదేశ్​ ప్రభుత్వం తన భూమిని స్వాధీనం చేసుకుందని ఆరోపించారు. జాతీయ రహదారి పనుల కోసం తన సొంత భూమిని వినియోగిస్తున్నట్లు ఫేస్​బుక్​లో ఓ పోస్ట్​ పెట్టారు. రావత్​ మరణించిన వారం రోజులకే ఆయన బావమరిది ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. తన బావ బిపిన్​ రావత్, సోదరి మధులికా రావత్ అంత్యక్రియల రోజు ఈ విషయాన్ని తాను గుర్తించినట్లు ఆయన తెలిపారు. దీనికి సంబంధించి ముందస్తు సమాచారం ఇవ్వలేదని, ఎలాంటి నష్టపరిహారమూ అందించలేదని యశో​వర్ధన్​ తెలిపారు.

‘భూమి తీసుకున్నందుకు నాకు ఎలాంటి పరిహారం ఇవ్వలేదు. ఎవరైనా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు అందాయి’ అని యశో​వర్ధన్​ సింగ్​ ఫేస్‌బుక్‌ ద్వారా వెల్లడించారు. దేశానికి సేవచేసేందుకు ముందుంటామని, కానీ అధికారులు ఎలాంటి సమాచారం లేకుండా ఈ విధానాన్ని ఎలా అనుసరిస్తారు? అని ఆయన ప్రశ్నించారు. మధులిక స్వస్థలమైన మధ్యప్రదేశ్​లోని షహడోల్‌ జిల్లా రాజాబాఘ్ సోహగ్​పుర్​లో జాతీయ రహదారికి ఆనుకొని సింగ్‌ కొంత భూమి ఉంది. ప్రస్తుతం అక్కడే జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ వ్యవహారం షహడోల్‌ జిల్లా కలెక్టర్​ వందనా వైద్య వరకు చేరింది. దీనిపై విచారణ జరిపిస్తానని, తహశీల్దార్​ సహా ఇతర అధికారులను సంఘటనా స్థలానికి పంపి పరిశీలిస్తామని ఆమె తెలిపారు. విచారణ అనంతరమే.. ఈ అంశంపై పూర్తి స్పష్టత వస్తుందన్నారు. ఇదే అంశంపై రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్​ మిశ్రా కూడా ట్వీట్​ చేశారు. ఎస్పీ నుంచి పూర్తి వివరాలు కోరిన ఆయన.. ఎవరైనా సరే చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడినట్లు తెలిస్తే కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని