
Mumbai Drugs Case: అధికారుల పాత్ర త్వరలోనే బయటపడుతుంది..!
మహా ప్రభుత్వాన్ని అపకీర్తిపాలు చేసేందుకే ప్రయత్నమన్న ఎంపీ సంజయ్ రౌత్
ముంబయి: ముంబయి క్రూయిజ్ డ్రగ్స్ కేసు పేరుతో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అపకీర్తిపాలు చేసేందుకు ఉద్దేశపూర్వక ప్రయత్నాలు జరుగుతున్నాయని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ఈ విషయంలో కొందరి అధికారుల పాత్ర త్వరలోనే బయటపడుతుందని జోస్యం చెప్పారు. ఆర్యన్‌ఖాన్ కేసులో శామ్ డిసౌజా అనే వ్యక్తి పేరు ఉందని.. ఆయన ముంబయిలోనే మనీ లాండరింగ్ వ్యవహారాలు నడిపే కీలక వ్యక్తి అని ఆరోపించారు.
‘ఆర్యన్ ఖాన్ అరెస్టు చేసి ఎన్సీబీ కార్యాలయానికి తీసుకువచ్చిన తర్వాత ఆయనతో శామ్ డిసౌజా అనే వ్యక్తి కలిసి వున్న ఫోటోలు కనిపించాయి. ఆయన ముంబయిలో మనీ లాండరింగ్ వ్యవహారాలు నడిపే కీలక వ్యక్తి. డిసౌజాకు రాజకీయ నాయకులు, అధికారులతో సత్సంబంధాలు ఉన్నాయి. అంతేకాకుండా కస్టమ్స్, ఐటీ అధికారులతోనూ మంచి సంబంధాలు ఉన్నాయి’ అని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. అంతకుముందు ఎన్సీబీ కార్యాలయంలో ఆర్యన్‌ఖాన్‌తో శామ్ డిసౌజా మాట్లాడుతున్నట్లు ఉన్న ఓ చిన్న వీడియోను సంజయ్ రౌత్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ కేసు ద్వారా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఇక ఎన్సీబీ అధికారులపై ప్రభాకర్ సాయీల్ చేసిన ఆరోపణలపై మాట్లాడిన రౌత్.. ఈ మోసం గురించి మాట్లాడి దేశానికి గొప్ప సహాయం చేశాడని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ఆయన ధైర్యాన్ని ప్రశంసిస్తున్నానని చెప్పారు.
ముంబయి క్రూయిజ్ డ్రగ్స్ కేసులో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను అక్టోబర్ 3న అరెస్టయిన విషయం తెలిసిందే. అప్పటినుంచి బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ న్యాయస్థానాల్లో చుక్కెదురవుతోంది. ఇదే సమయంలో ఆర్యన్ ఖాన్‌ను విడుదల చేసేందుకు రూ. 25కోట్లు ఇవ్వాలని ఎన్సీబీ అధికారులు డిమాండ్ చేసినట్లు విన్నానని సాక్షుల్లో ఒకరైన ప్రభాకర్ సాయీల్ సంచలన ఆరోపణలు చేయడం కలకలం రేపింది. అంతేకాకుండా తన నుంచి తెల్లకాగితంపై ఎన్సీబీ అధికారులు సంతకాలు చేయించుకున్నారని ఆరోపణలు చేశాడు. ఈ వ్యవహారంపై మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి ఎన్సీబీ దర్యాప్తు తీరును తప్పుబడుతూనే ఉంది. ఇవి కేవలం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అపకీర్తిపాలు చేసే ప్రయత్నాల్లో భాగమేనని ఆరోపిస్తోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.