Farm Laws: సాగుచట్టాల నివేదికను బహిర్గతం చేయండి..!

నూతన వ్యవసాయ చట్టాలపై రూపొందించిన నివేదికను సాధ్యమైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చే విషయాన్ని పరిశీలించాలని కోరుతూ సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీలోని సభ్యుడు అనిల్‌ ఘన్వాత్‌ భారత ప్రధాన న్యాయమూర్తికి తాజాగా లేఖ రాశారు.

Published : 24 Nov 2021 01:20 IST

సుప్రీంకోర్టుకు నిపుణుల కమిటీ సభ్యుడి విజ్ఞప్తి

దిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలపై రూపొందించిన నివేదికను సాధ్యమైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చే విషయాన్ని పరిశీలించాలని కోరుతూ సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీలోని సభ్యుడు అనిల్‌ ఘన్వాత్‌ భారత ప్రధాన న్యాయమూర్తికి తాజాగా లేఖ రాశారు. లేదంటే కమిటీనే ఆ నివేదికను బహిరంగ పరిచేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆ నివేదికలోని అంశాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని అనిల్‌ ఘన్వాత్‌ అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో వ్యవసాయరంగంలో సంస్కరణల కోసం ఉద్యమిస్తామని.. ఇందులో భాగంగా రానున్న రెండు నెలల్లోనే లక్షమందితో దిల్లీలో నిరసన చేపడుతామన్నారు.

నూతన వ్యవసాయ చట్టాలపై దేశవ్యాప్తంగా రైతుల నుంచి నిరననలు రావడంతో కేంద్ర ప్రభుత్వం వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కానీ, అంతకుముందు సాగుచట్టాలు వివాదాస్పదం కావడంతో వాటిపై సిఫార్సులు చేసేందుకు సుప్రీంకోర్టు ఓ కమిటీని నియమించింది. షేత్కరీ సంఘటన్‌ అధ్యక్షుడు అనిల్‌ ఘన్వాత్‌, వ్యవసాయరంగ ఆర్థికవేత్త అశోక్‌ గులాటీ, డాక్టర్‌ ప్రమోద్‌ కుమార్‌ జోషీలతో కూడిన కమిటీ దేశవ్యాప్తంగా వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు, సూచనలను స్వీకరించింది. అనంతరం పలు సిఫార్సులతో కూడిన నివేదికను ఈ ఏడాది మార్చి 19న సీల్డ్‌కవర్‌లో సుప్రీంకోర్టుకు అందించింది. ఇదే సమయంలో సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. వచ్చే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోని ఈ ప్రక్రియను పూర్తిచేస్తామని పేర్కొంది.

ఈ నేపథ్యంలో వ్యవసాయ చట్టాలపై తాము రూపొందించిన నివేదికకు ఇకపై ప్రాధాన్యత ఉండదని.. అయినప్పటికీ అందులో చేసిన సిఫార్సులు ఎంతో ప్రయోజనకరమైనవి అని నిపుణుల కమిటీలోని సభ్యుడైన షేత్కరీ సంఘటన్‌ అధ్యక్షుడు అనిల్‌ ఘన్వాత్‌ పేర్కొన్నారు. సాగు చట్టాలపై ప్రజలకు పూర్తి అవగాహన కలగడంతోపాటు కొంతమంది నాయకులు తప్పుదారి పట్టించడంతో వాటిపై రైతులకు ఏర్పడ్డ అపోహలు కూడా తొలగిపోయే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని