
Supreme Court: మార్గదర్శకాలు రూపొందించే నాటికి.. మూడో వేవ్ ముగుస్తుంది!
కేంద్రం తీరుపై సుప్రీం కోర్టు అసంతృప్తి
దిల్లీ: కొవిడ్ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు పరిహారం అందించడంలో కేంద్ర ప్రభుత్వం వైఖరిపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఆదేశాలు ఇచ్చినప్పటికీ పరిహారం, మరణ ధ్రువీకరణ పత్రాల జారీకి మార్గదర్శకాలు రూపొందించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కోర్టు, అవి రూపొందించే నాటికి మూడో వేవ్ కూడా ముగుస్తుందేమోననే అభిప్రాయం వ్యక్తం చేసింది.
‘కొవిడ్ మరణాలకు సంబంధించి మరణ ధ్రువీకరణ పత్రాల జారీ కోసం మార్గదర్శకాలను రూపొందించాలని చాలా రోజుల కిందటే ఆదేశాలు ఇచ్చాం. వాటిని ఇప్పటికే ఒకసారి పొడిగించాం. మీరు మార్గదర్శకాలు రూపొందించే నాటికి మూడో వేవ్ కూడా ముగిసిపోతుంది’ అని జస్టిస్ ఎం ఆర్ షా, జస్టిస్ అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అంతేకాకుండా కొవిడ్‌తో మరణించిన బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలని జూన్ 30న ఇచ్చిన ఆదేశాలనూ ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించింది. అయితే, ఆ గడువు సెప్టెంబర్ 8తో ముగియనున్న నేపథ్యంలో ఆ సమయంలోగా పరిహారం చెల్లింపుపై కేంద్రం ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. వీటికి సంబంధించి సెప్టెంబర్ 11లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ సందర్భంగా కేంద్ర తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. కోర్టు ఆదేశాలన్నీ ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని సుప్రీం ధర్మాసనానికి హామీ ఇచ్చారు.
ఇదిలా ఉంటే, కొవిడ్ మృతుల కుటుంబీకులకు పరిహారం ఇచ్చేందుకు తాజా మార్గదర్శకాలు జారీ చేయాలని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీని సుప్రీం కోర్టు ఇదివరకే ఆదేశించింది. పరిహారం ఇవ్వాలని చట్టంలో విస్పష్టంగా ఉన్నందున దాన్ని అమలు చేసి తీరాలని తేల్చి చెప్పింది. అయితే, తాత్కాలిక సాయం (ఎక్స్‌గ్రేషియా) కింద ఎంత ఇవ్వాలన్న దానిపై తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని, కేంద్ర ప్రభుత్వమే కనీస మొత్తాన్ని నిర్ధరించాలని సుప్రీం కోర్టు సూచించింది. వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు జాతీయ విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం రూ.4 లక్షల చొప్పున పరిహారం చెల్లించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలంటూ దాఖలైన రెండు వేరువేరు పిటిషన్లను విచారించిన సుప్రీం ధర్మాసనం ఈ విధంగా తీర్పు ఇచ్చింది. ఇదే సమయంలో పరిహారం చెల్లించడంతో పాటు, మరణ ధ్రువీకరణ పత్రాల జారీకి దేశవ్యాప్తంగా ఏకీకృత విధానానికి సంబందించి మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం ధర్మాసనం సూచించింది. ఇవి ఇంకా రూపొందించకపోవడం పట్ల ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.