Supreme Court on pegasus: దేశ భద్రతతో రాజీపడే అంశాలు.. కేంద్రం వెల్లడించాల్సిన అవసరం లేదు

దేశ భద్రతతో రాజీపడే విషయం ఏదైనా కేంద్రం వెల్లడించాల్సిన పనిలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన పెగాసస్ అంశంపై సోమవారం సుప్రీంలో విచారణ జరిగింది. ఈ క్రమంలో  కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అలాగే పిటిషనర్లు స్వతంత్ర దర్యాప్తు కోరగా.. దానిపై సమాధానం చెప్పాలని కేంద్రానికి నోటీసులు ఇచ్చింది. 

Published : 17 Aug 2021 23:36 IST

దిల్లీ: దేశభద్రతతో రాజీపడే విషయం ఏదైనా కేంద్రం వెల్లడించాల్సిన పనిలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన పెగాసస్ అంశంపై సోమవారం సుప్రీంలో విచారణ జరిగింది. ఈ క్రమంలో  కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అలాగే పిటిషనర్లు స్వతంత్ర దర్యాప్తు కోరగా.. దానిపై సమాధానం చెప్పాలని కేంద్రానికి నోటీసులు ఇచ్చింది. 

దేశ భద్తరతో ముడిపడి ఉన్న సమాచారం బహిర్గతం చేయడం వీలుకాదన్న కేంద్రం వాదనలతో సుప్రీం ఏకీభవించింది. ‘దేశ భద్రతతో సంబంధం ఉన్న విషయాలు వెల్లడించాల్సిన పనిలేదు. పిటిషనర్ల వాదనల ప్రకారం..వ్యక్తుల ఫోన్లు హ్యాక్‌ అయ్యాయి. దానిపై సంబంధిత అధికారి మాత్రమే స్పందించగలరు. భద్రతకు సంబంధించిన వివరాలు బహిర్గతం చేయకుండా.. సంబంధిత యంత్రాంగం అఫిడవిట్ దాఖలు చేయడానికి సమస్య ఏంటి?’ అంటూ కేంద్రాన్ని ప్రశ్నించింది. 

తాము కోర్టు ముందు దాయడానికి ఏమీ లేదని, దాని ఆధ్వర్యంలో ఏర్పడే కమిటీ ముందు అన్ని వివరాలు ఉంచుతామని కేంద్రం తెలిపింది. మరోపక్క పిటిషనర్ల తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. దేశభద్రత విషయంలో రాజీపడాలని తాము కోరుకోవడం లేదన్నారు. కేంద్రం పెగాసస్ స్పైవేర్‌ను వాడిందా? లేదా? తెలుసుకోవాలనుకుంటున్నామన్నారు. ఇదిలా ఉండగా.. ఈ అంశంపై తదుపరి విచారణ 10 రోజుల తర్వాత జరగనుంది. 

సరిగ్గా పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావడానికి ఒక్కరోజు ముందు ఈ పెగాసస్ వ్యవహారంపై కథనాలు వెలువడ్డాయి. ఈ స్పైవేర్ లక్షిత జాబితాలో భారత్‌కు చెందిన దాదాపు 300 మంది ఉన్నారని పేర్కొన్నాయి. రాజకీయ ప్రముఖులు, సీబీఐ అధికారులు, పాత్రికేయులు, హక్కుల కార్యకర్తల ఫోన్‌ నంబర్లు హ్యాక్‌ అయినట్లు వార్తలు వచ్చాయి. అయితే వీటిని కేంద్రం తోసిపుచ్చింది. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని