Supreme Court: కొవిడ్‌పై పోరులో.. భారత్‌ చర్యలు భేష్‌..!

కరోనా వైరస్‌పై చేస్తోన్న పోరాటంలో భారత్‌ చేస్తోన్న కృషిని మరే దేశం చేయలేకపోయిందని భారత అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.

Published : 23 Sep 2021 18:52 IST

మరే దేశం ఇలా చేయలేకపోయిందని సుప్రీం కోర్టు ప్రశంస

దిల్లీ: కరోనా వైరస్‌పై చేస్తోన్న పోరాటంలో భారత్‌ చేస్తోన్న కృషిని మరే దేశం చేయలేకపోయిందని భారత అత్యున్నత న్యాయస్థానం ప్రశంసించింది. కొవిడ్‌తో మరణించిన కుటుంబాలకు రూ.50వేల పరిహారం ఇస్తామని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించింది. కొవిడ్‌ మృతుల పరిహారంపై దాఖలైన పిటిషన్‌కు సంబంధించి తీర్పును రిజర్వ్‌ చేసిన సుప్రీం కోర్టు.. అక్టోబర్‌ 4వ తేదీన తుది తీర్పును వెలువరించనుంది.

‘కొవిడ్‌తో మృతి చెందిన కుటుంబాల కన్నీటిని తీర్చేందుకు ప్రయత్నించడం సంతోషకరం. బాధిత కుటుంబాలకు ఈ ఆర్థిక సహాయం కాస్త ఊరట కలిగిస్తుంది. కొవిడ్‌ పోరులో ఏ ఇతర దేశం చేయలేని ప్రయత్నాలను భారత్‌ చేస్తోందన్న వాస్తవాన్ని గుర్తించాలి’ అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎంఆర్‌ షా పేర్కొన్నారు. అధిక జనాభా కలిగిన దేశంగా ఉన్నప్పటికీ.. వ్యాక్సిన్‌ల ఖర్చు, దేశ ఆర్థికస్థితి, ప్రతికూల పరిస్థితుల్లో ఎదురైన సవాళ్లపై ప్రభుత్వం సరైన రీతిలోనే స్పందించిందని అన్నారు. కొవిడ్‌ పోరులో మరే దేశం ఇలా చేయలేకపోయిందని అభిప్రాయపడ్డారు. ఇదే విషయంపై మాట్లాడిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా.. ఒక దేశంగా భారత్‌ గొప్పగా స్పందించిందని తెలిపారు.

ఇక కరోనాతో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు రూ.50వేల పరిహారాన్ని అందించాలంటూ జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికారక సంస్థ (NDMA) సిఫార్సు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కరోనా రోగులకు సేవలు అందిస్తూ వైరస్‌ బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కూడా ఈ పరిహారం అందజేయనున్నట్లు తెలిపింది. కేవలం ఇప్పటివరకు మరణించిన కేసులకే కాకుండా భవిష్యత్తులో కొవిడ్‌-19తో సంభవించే మరణాలకూ ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ పరిహారం మొత్తాన్ని రాష్ట్ర విపత్తు స్పందన నిధి (SDRF) కింద ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తాయని సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలోనే కరోనా పోరుపై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సుప్రీంకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని