
Pegasus: మమతా సర్కార్‌కు సుప్రీంలో చుక్కెదురు.. పెగాసస్ దర్యాప్తుపై ‘స్టే’..!
ఇప్పటికే స్వతంత్ర కమిటీని నియమించిన సుప్రీంకోర్టు
దిల్లీ: దేశంలో సంచలనం సృష్టించిన పెగాసస్ హ్యాకింగ్ ఉదంతంపై పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన దర్యాప్తు కమిషన్ విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే, ఈ దర్యాప్తును నిలుపుదల చేయాలని భారత అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇప్పటికే ఈ విషయంపై ముగ్గురు సైబర్ నిపుణులతో కూడిన దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేసింది. ఈ అంశంపై దర్యాప్తు చేపట్టబోమని పశ్చిమబెంగాల్ ప్రభుత్వం తమకు హామీ ఇచ్చినప్పటికీ.. మళ్లీ దర్యాప్తును కొనసాగించడంపై చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో పెగాసస్‌పై బెంగాల్ ప్రభుత్వం వేసిన దర్యాప్తు కమిషన్‌పై స్టే విధించింది.
అంతకుముందు పెగాసస్ స్పైవేర్ సహాయంతో రాష్ట్రానికి చెందిన పలువురి ఫోన్లు హ్యాకింగ్‌కు గురయ్యాయని వార్తల నేపథ్యంలో వాటిపై దర్యాప్తు చేయాలని మమతా బెనర్జీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వ తీరు తమను నిరాశపరిచిందన్న దీదీ.. ఇందుకోసం ప్రత్యేకంగా దర్యాప్తు కమిషన్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రిటైర్డ్ న్యాయమూర్తులు జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ జ్యోతిర్మయి భట్టాఛార్యల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిషన్ దర్యాప్తు చేపడుతుందని చెప్పారు. పెగాసస్ స్పైవేర్ లక్ష్యిత జాబితాలో మమతా బెనర్జీ అల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీ పేర్లు ఉన్నట్లు వార్తలు వచ్చిన తరుణంలో మమతా సర్కార్ ఆ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా పెగాసస్ హ్యాకింగ్‌పై కేవలం పశ్చిమబెంగాల్ మాత్రమే ఇలా ప్రత్యేక దర్యాప్తును చేపట్టింది.
ఇదిలాఉంటే, దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన పెగాసస్ హ్యాకింగ్‌పై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపేందుకు సుప్రీంకోర్టు ఈ ఏడాది అక్టోబర్‌లోనే ఓ స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆర్.వి. రవీంద్రన్ నేతృత్వంలో దర్యాప్తు చేపట్టేందుకు సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఫోరెన్సిక్‌తోపాటు నెట్‌వర్క్స్, హార్డ్‌వేర్ రంగాల్లో అత్యంత అనుభవం ఉన్న ముగ్గురు నిపుణులను ఎంపిక చేసింది. అంతేకాకుండా దర్యాప్తులో భాగంగా వీరికి విస్తృత అధికారాలను కూడా సుప్రీం కోర్టు కల్పించింది. ఈ నేపథ్యంలో పెగాసస్‌పై పశ్చిమబెంగాల్ దర్యాప్తు మొదలుపెట్టినట్లు తమ దృష్టికి రావడంతో ఆ కమిషన్‌పై స్టే విధించింది.
ఇవీ చదవండి
Advertisement