Covid Origins: కొవిడ్‌ మూలాలపై శోధన.. మూసుకుపోతున్న దారులు!

కొవిడ్‌ మూలాలపై  (Covid Origins) జరుపుతోన్న శోధన నిలిచిపోయిందని.. దీంతో ఈ మిస్టరీని ఛేదించే కీలకమైన సమయానికి దారులు మూసుకుపోతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిపుణుల బృందం హెచ్చరించింది.

Published : 26 Aug 2021 17:12 IST

ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల ఆందోళన

వాషింగ్టన్‌: యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారి పట్టి పీడిస్తూనే ఉంది. చైనాలో వైరస్‌ వెలుగుచూసి దాదాపు 20నెలలు గడుస్తున్నా.. ఇప్పటికీ కొవిడ్‌ మూలాలు (Covid Origins) మాత్రం మిస్టరీగానే మిగిలిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వీటిపై శోధన నిలిచిపోయిందని.. దీంతో ఈ మిస్టరీని ఛేదించే కీలకమైన సమయానికి దారులు మూసుకుపోతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిపుణుల బృందం హెచ్చరించింది. ఇదే సమయంలో కొవిడ్‌ మూలాలపై అమెరికా నిఘా విభాగం జరిపిన అధ్యయనం కూడా ఏమీ తేల్చలేదని అక్కడి మీడియా పేర్కొంది.

మూసుకుపోతున్న దారులు..

‘సంకట స్థితిలో ఉన్న కరోనా మూలాల శోధనకు కీలక సమయంలో సహకారం అందించడం ఎంతో అవసరం. కానీ, ప్రస్తుతం ఆ ప్రక్రియ స్తంభించిపోయింది. ఇదే సమయంలో మొట్టమొదటి సారిగా నమోదైన కొవిడ్‌ కేసులకు సంబంధించిన వివరాలను ఇచ్చేందుకు చైనా నిరాకరిస్తోంది’ ’ అని కొవిడ్‌ మూలాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటైన నిపుణుల బృందం ఆందోళన వ్యక్తం చేసింది. ఇలా కరోనా మూలాలను శోధించేందుకు (Investigation) ఉన్న కీలకమైన అవకాశాలకు దారులు త్వరగా మూసుకుపోతున్నాయని నిపుణుల బృందం స్పష్టం చేసింది. కరోనా మూలాలపై శాస్త్రీయపరంగా చేసే అధ్యయనాలను ఇవి మరింత కష్టతరం చేస్తాయని హెచ్చరించింది. ముఖ్యంగా చైనాలో తొలుత వెలుగు చూసిన కేసుల్లో యాంటీబాడీలు (Antibodies) కూడా క్షీణించిపోయే అవకాశం ఉందని అంతర్జాతీయ నిపుణుల బృందం గుర్తుచేసింది. కొవిడ్‌ మూలాల శోధనపై ప్రస్తుత పరిస్థితులను పేర్కొంటూ డబ్ల్యూహెచ్‌ఓ నిపుణుల బృందం ఓ అంతర్జాతీయ జర్నల్‌లో తాజా వ్యాఖ్యలు చేసింది.

చైనా వితండవాదం..

కరోనా వైరస్‌ మూలాలపై అంతర్జాతీయంగా పెరుగుతోన్న ఒత్తిడితో చైనా ఆందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. కొవిడ్‌ మూలాల శోధన నిలిచిపోయిందని వస్తోన్న వార్తలు విచారకరమని..ఇది తమ తప్పు కాదని చైనా విదేశాంగశాఖ పేర్కొంది. అయితే, కొవిడ్‌ మహమ్మారి వుహాన్‌ (Wuhan) ల్యాబ్‌లోనే లీక్‌ అయ్యిందనే వాదనను మాత్రం చైనా తోసిపుచ్చుతోంది. ఈ విషయంలో అమెరికా తమను బలిపశువు చేస్తోందని చైనా ఎదురుదాడి చేస్తోంది. కొవిడ్‌ మూలాలపై ఒకవేళ చైనాలో మరోసారి దర్యాప్తు చేయాలనుకుంటే.. వాటిపై ఇతర ప్రదేశాల (అమెరికాలోని ఫోర్ట్‌ డెట్రిక్‌ సైనిక స్థావరం)లోనూ దర్యాప్తు చేపట్టాలని డిమాండ్‌ చేసింది. ఆ తర్వాతే చైనాలో రెండోసారి దర్యాప్తు చేయాలని పట్టుబడుతోంది. కొవిడ్‌ మూలాల విషయంలో అమెరికా తమపై నిరాధార ఆరోపణలు చేస్తే.. మేము చేసే ఎదురుదాడికి సిద్ధంగా ఉండాలని చైనా హెచ్చరించింది.

ఇదిలాఉంటే, కరోనా వైరస్‌ వెలుగుచూసిన తొలిరోజుల్లో వందల మంది బాధితులు, జంతువుల నుంచి చైనా శాంపిళ్లను సేకరించినట్లు సమాచారం. అయితే, అలా ఎంత మంది అనుమానితుల నమూనాలను సేకరించారనే విషయాన్ని చైనా వెల్లడించడం లేదు. కొవిడ్‌ మూలాలపై శోధన చేస్తోన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందానికి కూడా ఈ వివరాలు ఇవ్వడానికి చైనా నిరాకరిస్తోంది. ఇలా కొవిడ్‌ మూలాల శోధనపై అంతర్జాతీయ సమాజానికి చైనా సహకరించకపోవడంతో ఆ దేశంలో అనుమానాలు మరింత ఎక్కువవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని