Corona Alert: మనం అలసిపోవచ్చు.. కానీ, కరోనా కాదు!

కరోనా వైరస్‌ మహమ్మారి ముప్పు ఇంకా సమసిపోలేదని.. ఈ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిందేనని భారత ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. మనం అలసిపోయి ఉండవచ్చేమో గానీ, వైరస్‌ కాదని హెచ్చరించింది.

Published : 28 Jul 2021 01:40 IST

అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం

దిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారి ముప్పు ఇంకా సమసిపోలేదని.. ఈ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిందేనని భారత ప్రభుత్వం మరోసారి హెచ్చరించింది. మనం అలసిపోయి ఉండవచ్చేమో గానీ, వైరస్‌ కాదని హెచ్చరించింది. దేశంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతోన్న వేళ.. కొవిడ్‌ కట్టడిపై నిర్లక్ష్యం వహించవద్దని దేశప్రజలను అప్రమత్తం చేసింది. ముఖ్యంగా పండగల సీజన్‌ కంటే ముందే భారీ స్థాయిలో వ్యాక్సిన్‌ పంపిణీ చేయాల్సిన అవసరాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ నొక్కిచెప్పింది.

రెండే మార్గాలు..

దేశాన్ని వణికించిన కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావం ఇంకా ముగిసిపోలేదని నీతి ఆయోగ్‌ సభ్యుడు, వ్యాక్సిన్‌ పంపిణీపై ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఛైర్మన్‌ వీకే పాల్‌ స్పష్టం చేశారు. వైరస్‌ తీవ్రత తగ్గినట్లు కనిపించిన జిల్లాల్లోనూ ప్రస్తుతం వైరస్‌ వ్యాప్తి రేటు మళ్లీ పెరుగుతోందని అన్నారు. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్‌, సిక్కిం, నాగాలాండ్‌, మేఘాలయా రాష్ట్రాలతో పాటు కేరళలోనూ వైరస్‌ తీవ్రత పెరగడం ఆందోళన కలిగించే విషయమన్నారు. ఇలాంటి సమయంలో వ్యాక్సినేషన్‌ ముమ్మరం చేయడం, వైరస్‌ కట్టడి చర్యలు చేపట్టడం రెండే మార్గాలు మనముందున్నాయని స్పష్టం చేశారు. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్‌లన్నీ పూర్తిస్థాయిలో (100శాతం) గ్యారంటీ ఇవ్వనప్పటికీ.. వైరస్‌ బారినపడి తీవ్ర అనారోగ్యానికి గురికాకుండా  కాపాడుతాయని పేర్కొన్నారు. ఇక మరణం సంభవించే ప్రమాదం దాదాపుగా లేనట్లేనని వీకే పాల్‌ వెల్లడించారు.

భారీ వేడుకలకు సమయం కాదు..

‘వైరస్‌ విస్తృతంగా మార్పులకు గురికావడం ఆందోళన చెందాల్సిన విషయం. వీటివల్ల కొత్త వేరియంట్లు పుట్టుకొస్తాయి. ఇప్పటివరకు ఇన్‌ఫెక్షన్‌కు గురికాని వారికి వైరస్‌ బారినపడే ముప్పు మరింత పెరుగుతుంది. అందుచేత అత్యవసరం తప్పితే ప్రయాణాలు మానుకోండి. భారీ సమూహాలకు దూరంగా ఉండండి. పెద్దఎత్తున జరుపుకొనే పండుగలకు ఇది సరైన సమయం కాదు’ అని వ్యాక్సినేషన్‌పై ఏర్పాటు చేసిన జాతీయ నిపుణుల కమిటీ ఛైర్మన్‌ వీకే పాల్‌ స్పష్టం చేశారు. కరోనా తొలిదశ కూడా పండుగల సీజన్‌లోనే వచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

ఇదిలాఉంటే, దేశంలో 18ఏళ్ల పైడిన ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్‌ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్‌ మెగా డ్రైవ్‌ను జూన్‌ నెలలో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 44కోట్ల వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరిలో దాదాపు 9.9కోట్ల మందికి పూర్తిస్థాయిలో (రెండు డోసులు) ఇవ్వగా.. మిగతా వారికి ఒక డోసు ఇచ్చినట్లు తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని