Sero survey in Children: కరోనా మూడో ముప్పు.. చిన్నారుల గురించి భయం వద్దు..!

కరోనా మూడోముప్పు చిన్నారులపై ప్రభావం చూపే అవకాశం ఉందని పలు నివేదికల్లో నిపుణులు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

Published : 14 Sep 2021 16:19 IST

దిల్లీ: కరోనా మూడోముప్పు చిన్నారులపై ప్రభావం చూపే అవకాశం ఉందని పలు నివేదికల్లో నిపుణులు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చండీగఢ్‌లోని పోస్ట్‌ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌(పీజీఐఎంఈఆర్‌) నిర్వహించిన సీరో సర్వేలో ఆశాజనక ఫలితాలు వెలువడ్డాయి. రానున్న ముప్పు గురించి మరీ అంత ఆందోళన అవసరం లేదని తేలింది. 2,700 మంది చిన్నారుల నమూనాలను పరీక్షించగా.. 71 శాతం మందిలో కరోనా యాంటీ బాడీలు ఉన్నట్లు ఆ సర్వేలో వెల్లడైంది. దీనిపై పీజీఐఎంఈఆర్‌ డైరెక్టర్ డాక్టర్ జగత్ రామ్ మీడియాతో మాట్లాడారు. 

‘మనం కరోనా మూడో వేవ్ ప్రారంభ దశలో ఉన్నాం. 2,700 మంది చిన్నారులపై పీజీఐఎంఈఆర్ సీరో సర్వే నిర్వహించగా.. 71 శాతం మందిలో కరోనా యాంటీబాడీలు కనిపించాయి. మూడో ముప్పు పిల్లలపై తీవ్రంగా ప్రభావం చూపదని దీన్నిబట్టి తెలుస్తోంది’ అని జగత్ రామ్ వెల్లడించారు. చండీగఢ్‌, మురికివాడలు, గ్రామీణ, పట్టణ ప్రాంతాల నుంచి ఈ నమూనాలను సేకరించినట్లు తెలిపారు. అలాగే దిల్లీ, మహారాష్ట్ర నుంచి వెలువడిన సీరో సర్వేల్లో కూడా 50 నుంచి 75 శాతం మంది చిన్నారుల్లో యాంటీ బాడీలు ఉన్నట్లు తేలింది. ‘మనదేశంలో చిన్నారులకు టీకా అందుబాటులో లేదు. కరోనా సోకిన కారణంగానే వారిలో యాంటీబాడీలు కనిపించాయి. దీన్నిబట్టి మూడో ముప్పు పిల్లల్ని ప్రభావితం చేస్తుందని నేను భావించడం లేదు’ అని అభిప్రాయపడ్డారు. అలాగే ఆరు నుంచి 10 శాతం మందిలో బ్రేక్‌త్రూ ఇన్ఫెక్షన్‌ను గుర్తించినట్లు చెప్పారు. బ్రేక్‌త్రూ ఇన్ఫెక్షన్ వచ్చినప్పటికీ.. వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటుందన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని