Booster Dose: కొవిషీల్డ్‌ ‘బూస్టర్‌ డోసు’ అవసరమేనా..?

ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్‌ తయారీ కేంద్రంగా పేరుగాంచిన సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఛైర్మన్‌ కూడా మూడో డోసు (Booster Dose) అవసరాన్ని నొక్కిచెప్పారు.

Published : 18 Aug 2021 15:20 IST

సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఛైర్మన్‌ ఏమన్నారంటే..

పుణె: కరోనా వైరస్‌ మహమ్మారిని నిరోధించే వ్యాక్సిన్‌ పంపిణీ ముమ్మరంగా కొనసాగుతున్న వేళ.. బూస్టర్‌ డోసుపైనా చర్చ జరుగుతోంది. కొత్తగా వెలుగు చూస్తోన్న వేరియంట్లను ఎదుర్కొనేందుకు మూడో డోసు అనివార్యం కావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్‌ తయారీ కేంద్రంగా పేరుగాంచిన సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఛైర్మన్‌ సైరస్‌ పూనావాలా  కూడా మూడో డోసు (Booster Dose) అవసరాన్ని నొక్కిచెప్పారు. ఇప్పటికే తనతోపాటు తమ సంస్థలో పనిచేసే ఏడు వేల మంది కొవిషీల్డ్‌ (Covishield) మూడో డోసు తీసుకున్నట్లు వెల్లడించారు.

‘రెండో డోసు తీసుకున్న ఆరు నెలల తర్వాత యాంటీబాడీలు క్షీణిస్తున్నందున నేను మూడో డోసు తీసుకున్నాను. మా సంస్థలో పనిచేసే 7-8వేల మంది ఉద్యోగులకు కూడా మూడో డోసు (Third Dose) అందించాం. రెండో డోసు తీసుకున్న 6నెలల తర్వాత బూస్టర్‌ డోసు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్మన్‌ సూచించారు. తొలి రెండు డోసుల మధ్య కనీసం రెండు నెలల గడువు అవసరమైనప్పటికీ డోసుల కొరత కారణంగా కేంద్ర ప్రభుత్వం ఈ గడువును మూడు నెలలకు పెంచిందని సీరం ఛైర్మన్‌ అభిప్రాయపడ్డారు.

ఇదిలాఉంటే, మూడో డోసుపై కేంద్రప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా కేరళ హైకోర్టుకు సమర్పించిన ప్రమాణ పత్రంలోనూ బూస్టర్‌ డోసుకు ప్రభుత్వ మార్గదర్శకాలు అనుమతించవని వెల్లడించింది. ఇదే విషయాన్ని కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ల మిక్సింగ్‌పై అధ్యయనం జరుపుతోన్న వెల్లూర్‌లోని క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ గగన్‌దీప్‌ కాంగ్‌ కూడా స్పష్టం చేశారు. బూస్టర్‌ డోసు అవసరమనేందుకు ఇప్పటివరకు ఎలాంటి అధ్యయన సమాచారం ప్రస్తుతానికి అందుబాటులో లేదని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని