
Serum Institute: బూస్టర్ డోసుగా ‘కొవిషీల్డ్’కు అనుమతి ఇవ్వండి..!
దిల్లీ: కొత్త వేరియంట్ల రూపంలో కరోనా వైరస్ మహమ్మారి విరుచుకుపడుతున్న వేళ.. బూస్టర్ డోసు ఇవ్వాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా పెరుగుతోంది. కేరళ, రాజస్థాన్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు కూడా బూస్టర్ డోసుపై నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశాయి. ఈ నేపథ్యంలో తమ ‘కొవిషీల్డ్’ టీకాను బూస్టర్ డోసుగా వినియోగించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI)కు దరఖాస్తు చేసుకుంది. దేశంలో వ్యాక్సినేషన్‌కు సరిపడా టీకా నిల్వలు ఉన్న నేపథ్యంలో బూస్టర్ డోసును పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.
బూస్టర్ డోసు అవసరాన్ని తెలియజేస్తూ సీరం ఇన్‌స్టిట్యూట్‌లోని ప్రభుత్వ వ్యవహారాల విభాగ డైరెక్టర్ రాకేశ్ కుమార్ సింగ్ డీసీజీఐకు దరఖాస్తు చేశారు. ఇప్పటికే ఆస్ట్రాజెనెకా టీకాను బూస్టర్ డోసుగా వినియోగించేందుకు బ్రిటన్ ఔషధ, ఆరోగ్య ఉత్పత్తుల నియంత్రణ సంస్థ కూడా అనుమతిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ ముప్పు తొలగని నేపథ్యంలో ఇప్పటికే చాలా దేశాలు బూస్టర్ డోసు పంపిణీని ప్రారంభించినట్లు డీసీజీఐ దృష్టికి తీసుకెళ్లారు. ‘దేశంలో ప్రస్తుతం టీకాల కొరత లేని విషయం మీకు తెలిసిందే. ఇదే సమయంలో ప్రమాదకరమైన కొత్త వేరియంట్లు వెలుగు చూస్తుండడంతో బూస్టర్ డోసు అందించాలనే డిమాండ్ కూడా రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే రెండు మోతాదుల్లో కొవిషీల్డ్ తీసుకున్న మన దేశానికి చెందినవారితో పాటు ఇతర దేశాల పౌరులు.. బూస్టర్ డోసు విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు’ అని డీసీజీఐకి చేసుకున్న దరఖాస్తులో రాకేశ్ కుమార్ సింగ్ పేర్కొన్నారు.
కసరత్తు ప్రారంభించిన కేంద్రం..
మరోవైపు దేశంలో సెకండ్ వేవ్ వంటి పరిస్థితులు తలెత్తకుండా చూడడంలో భాగంగా బూస్టర్ వినియోగంపై ఏం నిర్ణయం తీసుకున్నారో తెలపాలని ఈ మధ్యే దిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇలా దీనిపై దేశవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో అసలు బూస్టర్ డోసు ఇవ్వాలా? వద్దా? అనే అంశంపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో భాగంగా నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్, నేషనల్ ఎక్స్‌పర్ట్ గ్రూప్ ఆన్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్‌లు బూస్టర్ డోసు ఇవ్వాల్సిన శాస్త్రీయ సాక్ష్యాధారాలు, అవసరంపై చర్చలు జరుపుతున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలోనే కొవిషీల్డ్‌ను బూస్టర్ డోసుగా అందించేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీరం ఇన్‌స్టిట్యూట్ కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థకు దరఖాస్తు చేసుకుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.