Covishield: అక్టోబర్‌లోనే 22 కోట్ల డోసులు అందుబాటులో..!

అక్టోబర్‌ నెలలోనే దాదాపు 22కోట్ల కొవిషీల్డ్‌ (Covishield) డోసులను అందుబాటులో ఉంచుతామని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (SII) ప్రకటించింది.

Published : 22 Sep 2021 02:09 IST

డిసెంబర్‌ నాటికి 130కోట్ల డోసులు అందిస్తామన్న సీరం ఇన్‌స్టిట్యూట్‌

దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ విస్తృతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో వ్యాక్సిన్‌ తయారీ సంస్థలు ఉత్పత్తిని గణనీయంగా పెంచే ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా ఒక్క అక్టోబర్‌ నెలలోనే దాదాపు 22కోట్ల కొవిషీల్డ్‌ (Covishield) డోసులను అందుబాటులో ఉంచుతామని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (SII) ప్రకటించింది. ‘వ్యాక్సిన్‌ మైత్రి’లో భాగంగా మరికొన్ని రోజుల్లోనే విదేశాలకు టీకాలను ఎగుమతి చేసే ప్రక్రియను మళ్లీ మొదలు పెడతామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన నేపథ్యంలో సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఈ ప్రకటన చేసింది.

దేశంలో తొలుత అందుబాటులోకి వచ్చిన కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (Serum Institute of India) ఉత్పత్తి చేస్తోంది. మొదట్లో పరిమిత స్థాయిలోనే ఉత్పత్తి చేసినప్పటికీ ప్రస్తుతం తయారీ సామర్థ్యాన్ని నెలకు 20కోట్ల డోసులకు పెంచింది. జనవరి నుంచి ఇప్పటివరకు (సెప్టెంబర్‌ 19నాటికి) మొత్తం 66.33 కోట్ల డోసులను కేంద్ర ఆరోగ్యశాఖకు అందజేసినట్లు సీరం ఇన్‌స్టిట్యూట్‌ వెల్లడించింది. వీటితోపాటు మరో 7.7కోట్ల డోసులను రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రైవేటు ఆస్పత్రులకు అందించామని తెలిపింది. వీటికి అదనంగా ఈమధ్యే చేసుకున్న ఒప్పందం ప్రకారం, డిసెంబర్‌ వరకు మరో 66 కోట్ల డోసులను అందజేస్తామని పేర్కొంది. ఇలా ఈ ఏడాది డిసెంబర్‌ 31నాటికి మొత్తం 130 కోట్ల కొవిషీల్డ్‌ డోసులను కేంద్ర ప్రభుత్వానికి అందజేసేందుకు కృషి చేస్తున్నట్లు సీరం ఇన్‌స్టిట్యూట్‌ వెల్లడించింది.

ఇదిలాఉంటే, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 82కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీటిలో 88శాతం (72కోట్లు) కొవిషీల్డ్‌వి కాగా, 11.4శాతం (దాదాపు 6కోట్ల) డోసులను భారత్‌ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్‌ (Covaxin) టీకాలు ఉన్నాయి. మరో వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-వి (Sputnik V) మాత్రం ఒకశాతం కన్నా తక్కువగా పంపిణీ చేశారు. ఇక నిత్యం దేశవ్యాప్తంగా 60లక్షలకు పైగా డోసులను అందిస్తుండగా.. ప్రధాని మోదీ జన్మదినం రోజున రికార్డు స్థాయిలో ఏకంగా 2.5కోట్ల డోసులను దేశవ్యాప్తంగా పంపిణీ చేశారు. ఇలా ఇప్పటివరకు దేశంలో అర్హులైన వారిలో 22శాతం మంది పూర్తి మోతాదులో వ్యాక్సిన్‌ తీసుకోగా.. 65శాతం మంది కనీసం ఒకడోసును తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని