Afghanistan: కాబుల్ ఎయిర్‌పోర్టులో కాల్పులు.. ఐదుగురి మృతి

అఫ్గానిస్థాన్‌ తాలిబన్ల వశమవడంతో అక్కడి ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దీంతో వేలాది మంది పౌరులు అఫ్గాన్‌ను వీడి వెళ్లేందుకు కాబుల్‌ విమానాశ్రయానికి పోటెత్తారు

Published : 16 Aug 2021 13:26 IST

కాబుల్‌: అఫ్గానిస్థాన్‌ తాలిబన్ల వశమవడంతో అక్కడి ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దీంతో వేలాది మంది పౌరులు అఫ్గాన్‌ను వీడి వెళ్లేందుకు కాబుల్‌ విమానాశ్రయానికి పోటెత్తారు. దీంతో అక్కడ విపరీతమైన రద్దీ ఏర్పడింది. పరిస్థితి చేదాటిపోతుండటంతో రద్దీని అదుపుచేసేందుకు భద్రతాబలగాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఐదుగురు పౌరులు మృతిచెందినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ భీతావాహ వాతావరణం నెలకొంది.

దేశ రాజధాని కాబుల్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ దేశం విడిచి వెళ్లిపోయారు. ఈ వార్త తెలియగానే భయాందోళనకు గురైన దేశ పౌరులు విమానాశ్రయానికి చేరుకున్నారు. దీంతో హమీద్‌ కర్జాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలోని పౌర టెర్మినల్‌ కిక్కిరిసిపోయింది. ఒక్కో విమానం వద్ద వందల సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. ఈ నేపథ్యంలో రద్దీని అదుపుచేసేందుకు భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారు.

ఇదిలా ఉండగా.. అఫ్గాన్‌లో సంక్షోభం నేపథ్యంలో అక్కడ ఉన్న తమ పౌరులను వెనక్కి రప్పించేందుకు భారత్‌, అమెరికా సహా పలు దేశాలు చర్యలు చేపట్టాయి. అయితే తాజాగా అఫ్గాన్‌ గగనతలాన్ని మూసివేశారు. దీంతో ఇతర దేశాల నుంచి అక్కడికి విమానాలు వెళ్లలేని పరిస్థితి తలెత్తింది. మరోవైపు గగనతలాన్ని మూసివేయడంతో ఇతర దేశాల విమానయాన సంస్థలు తమ విమానాలను దారిమళ్లిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని