Adar Poonawalla: బ్రిటన్‌ నిబంధనలు గందరగోళమే..!

భారత్‌ తయారు చేస్తోన్న కొవిషీల్డ్‌ (ఆక్స్‌ఫర్డ్‌ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌)ను బ్రిటన్‌ అధికారులు గుర్తించకపోవడం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర గందరగోళానికి కారణమవుతున్నాయని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈఓ అదర్‌ పూనావాలా పేర్కొన్నారు.

Published : 02 Oct 2021 01:41 IST

సీరం ఇన్‌స్టిట్యూట్‌ చీఫ్‌ అదర్‌ పూనావాలా

పుణె: భారత్‌ తయారు చేస్తోన్న కొవిషీల్డ్‌ (ఆక్స్‌ఫర్డ్‌ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌)ను బ్రిటన్‌ అధికారులు గుర్తించకపోవడం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర గందరగోళానికి కారణమవుతున్నాయని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈఓ అదర్‌ పూనావాలా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించిన వ్యాక్సిన్‌ను ధ్రువీకరించేందుకు ఓ వేదికను రూపొందించుకోవాలని అభిప్రాయపడ్డారు. ఈ ప్రక్రియ సజావుగా కొనసాగేలా అన్ని దేశాలు సహకరించుకోవాలని పిలుపునిచ్చిన ఆయన.. టీకా ధ్రువీకరణకు పరస్పరం అంగీకరించిన ఒప్పందంపై సంతకం చేయాల్సిన అవసరముందని ఓ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

ఇక వ్యాక్సిన్‌ ఎగుమతిపై స్పందించిన అదర్‌ పూనావాలా.. కొవాక్స్‌ కార్యక్రమం ద్వారా కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ ఎగుమతిని అక్టోబర్‌ నెలలో తిరిగి ప్రారంభిస్తామని పేర్కొన్నారు. జనవరి నాటికి వ్యాక్సిన్‌ ఎగుమతిని క్రమంగా పెంచుతామని చెప్పారు. దేశంలో కొవిడ్‌ టీకాలకు ఉన్న డిమాండ్‌ దృష్ట్యా గత ఆరు నెలలుగా వీటి ఎగుమతిని నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం దేశంలో కొవిషీల్డ్‌ ఉత్పత్తి గణనీయంగా పెరగడంతో మరోసారి వీటిని ఎగుమతి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సీరం ఇన్‌స్టిట్యూట్‌ ప్రతినెలా దాదాపు 20కోట్లపైగా కొవిషీల్డ్‌ డోసులను ఉత్పత్తి చేస్తున్నట్లు సమాచారం.

భారత్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్‌ తయారుచేస్తోన్న కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న వారు బ్రిటన్‌ వస్తే.. పదిరోజుల పాటు క్వారంటైన్‌ తప్పనిసరి అంటూ అక్కడి అధికారులు నిబంధనలు విధించారు. మార్గదర్శకాల ప్రకారం కొవిషీల్డ్‌ను ఆమోదించినట్లు చెబుతున్నప్పటికీ.. టీకా ధ్రువీకరణ పత్రంతో తమకు సమస్య ఉందని వెల్లడిస్తున్నారు. దీనిని తీవ్రంగా పరిగణించిన భారత ప్రభుత్వం.. ఇది వివక్షాపూరితమేనని అభిప్రాయపడింది. చివరకు దిగివచ్చిన బ్రిటన్‌ ప్రభుత్వం.. అంతర్జాతీయ పర్యాటక అడ్వైజరీ జాబితాలో కొవిషీల్డ్‌ను చేర్చుతున్నట్లు ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు