Vaccine Maitri: వ్యాక్సిన్‌ మైత్రి.. విదేశాలకు టీకా సరఫరాకు కేంద్రం అనుమతి

వ్యాక్సిన్‌ మైత్రిలో భాగంగా ఇతర దేశాలకు వ్యాక్సిన్‌ డోసులు సరఫరా చేసేందుకు తయారీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

Published : 07 Oct 2021 22:00 IST

దిల్లీ: కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చి 10 నెలలు గడుస్తున్నప్పటికీ చాలా దేశాలు ఇప్పటికీ టీకా కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో పొరుగు దేశాలతో పాటు ఇతర దేశాలను ఆదుకునేందుకు భారత్‌ మరోసారి నడుం బిగించింది. వ్యాక్సిన్‌ మైత్రిలో భాగంగా ఇతర దేశాలకు వ్యాక్సిన్‌ డోసులు సరఫరా చేసేందుకు తయారీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇందులో భాగంగా నేపాల్‌, మయన్మార్‌, బంగ్లాదేశ్‌లకు 10లక్షల డోసుల చొప్పున కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను అందజేసేందుకు సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (SII)కు అనుమతించింది. మరో ప్రముఖ సంస్థ భారత్‌ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్‌ 10లక్షల డోసులను ఇరాన్‌కు సరఫరా చేసేందుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

వీటితో పాటు పెద్ద మొత్తంలో కొవిషీల్డ్‌ను ఎగుమతి చేసేందుకు సీరం ఇన్‌స్టిట్యూట్‌కు భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగా దాదాపు 3కోట్ల డోసులకు సమానమైన ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను సీరం ఇన్‌స్టిట్యూట్‌ బ్రిటన్‌కు సరఫరా చేయనుంది. దీనికి సంబంధించి యూకేతో ఒప్పందం కుదుర్చుకున్న దృష్ట్యా.. వ్యాక్సిన్‌ సరఫరాకు అనుమతివ్వాలని కోరుతూ సీరం ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ (ప్రభుత్వ, నియంత్రణ సంస్థల వ్యవహారాల విభాగం) ప్రకాశ్‌ కుమార్‌ సింగ్‌ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రికి ఇదివరకే విజ్ఞప్తి చేశారు.

ఇక వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన మొదట్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలో ఏర్పాటైన కొవాక్స్‌ కార్యక్రమంలో భాగంగా ఇతర దేశాలకు వ్యాక్సిన్‌ డోసులను భారత్‌ ఉచితంగానే అందించింది. వీటితోపాటే ఇతర దేశాలతో చేసుకున్న ఒప్పందాల ప్రకారం తయారీ సంస్థలు ఎగుమతి ప్రారంభించాయి. అయితే, దేశంలో సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి పెరగడంతోపాటు వ్యాక్సిన్‌ కొరత కారణంగా విదేశాలకు వ్యాక్సిన్‌ ఎగుమతి, సరఫరా చేసే కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం బ్రేక్‌ వేసింది. గడిచిన రెండు నెలలుగా దేశంలో వ్యాక్సిన్‌ ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా తయారు చేసే కొవిషీల్డ్‌ డోసుల ఉత్పత్తి నెలకు 20కోట్లకు చేరింది. మరోవైపు భారత్‌ బయోటెక్‌ కూడా నెలకు 3 కోట్ల కొవాగ్జిన్‌ డోసులను ఉత్పత్తి చేస్తోంది. ఈ నేపథ్యంలో స్థానిక అవసరాలకు సరిపోనూ మిగతా వ్యాక్సిన్‌ డోసులను ‘వ్యాక్సిన్‌ మైత్రి’లో భాగంగా ఇతర దేశాలకు సరఫరా చేస్తామని కేంద్రం ఈ మధ్యే ప్రకటించింది. ఇందులో భాగంగానే వ్యాక్సిన్‌ ఎగుమతి పునఃప్రారంభిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని