
Sindhutai sapkal: అనాథ పిల్లల అమ్మ సింధుతాయ్ సప్కాల్ మృతి
పుణె: ప్రముఖ సంఘ సేవకురాలు, పద్మశ్రీ అవార్డు గ్రహీత, అనాథ పిల్లలు అమ్మగా పిలుచుకునే సింధుతాయ్ సప్కాల్ (74) తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో నెలరోజుల క్రితం పుణెలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో ఆమెకు మంగళవారం రాత్రి గుండెపోటు వచ్చింది. దీంతో చికిత్స పొందుతూ సింధుతాయ్ మృతిచెందారు. అందరూ ‘మాయ్’ (అమ్మ)గా పిలుచుకునే సింధుతాయ్ పుణెలో ‘సన్మతి బాల్ నికేతన్’ అనే అనాథ ఆశ్రమాన్ని నడుపుతున్నారు. తన జీవితంలో ఇప్పటివరకు 1000 మంది పైనే అనాథ పిల్లలను దత్తత తీసుకొని చేరదీశారు. సింధుతాయ్ సేవలకు దేశవ్యాప్తంగా ఎన్నో అవార్డులు వచ్చాయి. 2010లో మరాఠీలో ‘మి సింధుతాయ్ సప్కాల్ బోల్టే’ పేరుతో సింధుతాయ్ బయోపిక్ విడుదలైంది. మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో సింధుతాయి జన్మించారు.
సింధుతాయ్ మృతికి ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘‘సమాజానికి చేసిన సేవలతో సింధుతాయ్ ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఆమె కృషితో చాలా మంది పిల్లలు ప్రస్తుతం ఉత్తమ జీవితాన్ని గడుపుతున్నారు. అట్టడుగు వర్గాల కోసం సైతం ఆమె కృషిచేశారు. సింధుతాయ్ మృతి తీరని లోటు. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.