Dharmalingam: మరికొన్ని గంటల్లోనే ఉరిశిక్ష.. కొవిడ్ సోకడంతో వాయిదా!

ప్రాణాంతకమైన కరోనా మహమ్మారి ఆ యువకుడికి సంజీవనిగా మారింది. కొన్ని గంటల్లోనే అమలయ్యే ఉరిశిక్ష నుంచి తాత్కాలిక ఉపశమనం కలిగిస్తూ మరికొన్ని రోజులు ఊపిరి పీల్చుకునేలా చేసింది.

Updated : 10 Nov 2021 07:47 IST

భారత సంతతి మలేసియా వాసికి తాత్కాలిక ఊరట

సింగపూర్‌: మృత్యువు ఒడి చేరడానికి మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. తెల్లవారితే మరణశిక్ష. ఉన్నత న్యాయస్థానాల్లో అప్పీళ్లు, అధ్యక్షుడి క్షమాభిక్ష వంటి ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. అయితే, భూమ్మీద అతడికి ఇంకా నూకలు మిగిలే ఉన్నాయి. ఇలాంటి సమయంలోనే ప్రాణాంతకమైన కరోనా మహమ్మారి ఆ యువకుడికి సంజీవనిగా మారింది. కొన్ని గంటల్లోనే అమలయ్యే ఉరిశిక్ష నుంచి తాత్కాలిక ఉపశమనం కలిగిస్తూ.. మరికొన్ని రోజులు ఊపిరి పీల్చుకునేలా చేసింది. మాదక ద్రవ్యాల కేసులో భారత సంతతికి చెందిన ఓ మలేసియా వ్యక్తికి సింగపూర్‌లో ఎదురవుతోన్న అనుభవం ఇది.

భారత సంతతి మలేసియా వాసి నాగేంద్రన్‌ ధర్మలింగానికి మాదక ద్రవ్యాల రవాణా కేసులో సింగపూర్‌ కోర్టు మరణశిక్ష విధించింది. బుధవారం నాడు (నవంబర్‌ 10న) అక్కడి ఛాంగీ జైల్లో ధర్మలింగం మరణ దండన ఎదుర్కోనున్నాడు. ఇదే సమయంలో తన మానసిక స్థితి బాగాలేనందున మరణశిక్ష నిలిపివేయాలంటూ సోమవారం నాడు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. వీటిని తోసిపుచ్చిన న్యాయస్థానం.. అప్పీలుకు వెళ్లేందుకు ఒకరోజు అనుమతి ఇచ్చింది. దీనిపై మంగళవారం నాడు మలేసియా హైకోర్టు విచారణ చేపట్టింది. ఇదే సమయంలో నాగేంద్రన్‌కు కొవిడ్‌-19 నిర్ధారణ అయినట్లు హైకోర్టు న్యాయమూర్తులకు జైలు అధికారులు తెలియజేశారు. దీంతో బుధవారం నాటి ఉరిశిక్షను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.

ముద్దాయికి కొవిడ్‌-19 నిర్ధారణ కావడాన్ని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. మరణశిక్ష గడియలు దగ్గరపడిన సమయంలో ఇది నిజంగా ఊహించని పరిణామమని అభిప్రాయపడింది. ఒకవేళ ముద్దాయికి కరోనా సోకినట్లయితే మరణశిక్షను అమలు చేయలేమని పేర్కొంది. ఇలాంటి సమయంలో మనం మానవత్వాన్ని ప్రదర్శించాల్సిన అవసరముందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆండ్రూ ఫాంగ్‌ పేర్కొన్నారు. వీటిపై విచారణ పూర్తయ్యే వరకు మరణశిక్షను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం కేసు విచారణను వాయిదా వేశారు. దీంతో నాగేంద్రన్‌కు మరికొన్ని రోజులు ఊరట లభించింది.

అంతర్జాతీయ దృష్టి..

ఉరిశిక్షకు సమయం దగ్గరపడుతోన్న సమయంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకోవడంతో ఈ కేసుపై మరింత ఆసక్తి పెరిగింది. దీంతో విచారణ సందర్భంగా హైకోర్టు ప్రాంగణం మొత్తం అంతర్జాతీయ మీడియా, స్థానిక ఆందోళనకారులతో నిండిపోయింది. ఇప్పటికే నాగేంద్రన్‌ మరణశిక్షను వ్యతిరేకించే వారిసంఖ్య కూడా భారీగా పెరిగింది. ఇందుకోసం ఆన్‌లైన్‌లో దాదాపు 70వేల మంది సంతకాలు చేశారు. మలేసియా ప్రధాని కూడా ఇదే అంశంపై సింగపూర్‌ ప్రధానికి లేఖ రాశారు. మరోవైపు మానవహక్కుల సంఘాలు ఉరిశిక్షను వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టాయి. దీంతో నాగేంద్రన్‌ ధర్మలింగం మరణశిక్ష వ్యవహారం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది.

42 గ్రాముల మాదక ద్రవ్యాలు..

ఇదిలాఉంటే, సింగపూర్‌కు 42గ్రాముల హెరాయిన్‌ సరఫరా చేశారని నాగేంద్రన్‌పై 2009లో అభియోగాలు నమోదయ్యాయి. అనంతరం అవి నిరూపణ కావడంతో 2010లో ఆయనకు మరణశిక్ష పడింది. తర్వాత ఉన్నత న్యాయస్థానాల్లో పలుసార్లు అప్పీళ్లు చేసుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చివరకు అధ్యక్షుడి క్షమాభిక్ష కోరినన్నప్పటికీ అక్కడ కూడా నిరాశే మిగిలింది. ఇలా 11ఏళ్ల క్రితం పడిన మరణశిక్ష నవంబర్‌ 10వ తేదీన అమలు కావాల్సి ఉంది. చివరకు ముద్దాయికి కొవిడ్‌ సోకడంతో మరణశిక్ష మరోసారి వాయిదా పడింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని