Published : 23 Nov 2021 02:11 IST

Rakesh Tikait: మాకు క్షమాపణలు అవసరం లేదు.. మా డిమాండ్లు నెరవేరిస్తే చాలు

నేడు లఖ్‌నవూలో కిసాన్ మహాపంచాయత్‌లో పాల్గొన్న రైతు సంఘాలు

లఖ్‌నవూ: సాగు చట్టాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించి, కేంద్రం కాస్త వెనక్కి తగ్గినప్పటికీ.. తమ డిమాండ్లు పూర్తిగా నెరవేరలేదంటూ అన్నదాతలు నిరసన సాగిస్తున్నారు. ఈ క్రమంలో సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్‌కేఎం) సోమవారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూలో కిసాన్ మహాపంచాయత్‌కు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్ మాట్లాడుతూ.. ప్రభుత్వం పరిష్కరించాల్సిన సమస్యలు ఎన్నో ఉన్నాయని వెల్లడించారు. ‘మూడు చట్టాలను రద్దు చేసిన ప్రభుత్వం రైతన్నలతో మాట్లాడేందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. కేంద్రం చట్టాల రద్దుపై మాకు పూర్తి స్పష్టత ఇచ్చి, రైతులు ఇంటికి వెళ్లడం ప్రారంభించేలా చూడాలి. అలాగే ప్రసంగంలో భాగంగా ప్రధాని క్షమాపణలు చెప్పారు. ఆ అవసరం లేదు. కానీ మా సమస్యలపై తీవ్రంగా దృష్టిసారించాల్సి ఉంది’ అని టికాయిత్ వ్యాఖ్యానించినట్లు ఓ మీడియా సంస్థ వెల్లడించింది. 

గత శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ.. మూడు సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో ప్రారంభం కానున్న శీతకాల సమావేశాల్లో అందుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలిపారు. అయితే ఈ రద్దుకు ముందే రైతు సంఘాలు మహాపంచాయత్‌కి పిలుపునిచ్చాయి. దానిలో భాగంగా సోమవారం రైతులు ఒక్కదగ్గర చేరి, తదుపరి కార్యాచరణపై చర్చించారు. 

ఇదిలా ఉండగా.. ఆదివారం ఎస్‌కేఎం ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాసింది. మిగిలిన ఆరు డిమాండ్లపై చర్చించేందుకు తమతో కేంద్రం చర్చలు జరపాలని అందులో కోరింది. కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ ఇవ్వాలని కోరడంతో పాటు లఖింపూర్ ఖేరి ఘటనకు సంబంధించి కేంద్రమంత్రి అజయ్ మిశ్రాను తొలగించాలని డిమాండ్ చేసింది. అలాగే రైతులపై పెట్టిన కేసుల్ని ఉపసంహరించుకోవాలని ఆ లేఖలో పేర్కొంది. గత ఏడాది కేంద్రం కొత్త సాగు చట్టాలను తీసుకురావడంతో ఆగ్రహించిన రైతన్నలు దాదాపు సంవత్సర కాలంగా దిల్లీ సరిహద్దుల్లో నిరసన వ్యక్తం చేస్తోన్న తెలిసిందే. అధికారికంగా ఆ మూడు చట్టాలను రద్దు చేసేవరకు తమ నిరసన కొనసాగుతుందని కొందరు రైతు నాయకులు ఇప్పటికే వెల్లడించారు.


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని