China on QUAD Summit: క్వాడ్‌ కూటమితో ఉలిక్కిపడుతున్న చైనా..!

క్వాడ్‌ కూటమిపై చైనా అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. కొన్ని దేశాలు ప్రత్యేక బృందంగా ఏర్పడి ‘చైనా ముప్పు’ను విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయని పేర్కొంది.

Published : 28 Sep 2021 01:37 IST

బీజింగ్‌: క్వాడ్‌ కూటమిపై చైనా అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. కొన్ని దేశాలు ప్రత్యేక బృందంగా ఏర్పడి ‘చైనా ముప్పు’ను విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయని పేర్కొంది. అయితే, అటువంటి ప్రయత్నాలు విఫలమవుతాయని అభిప్రాయపడింది. ప్రపంచంలో నాలుగు ప్రభావవంత దేశాలుగా ఉన్న అమెరికా, భారత్‌, ఆస్ట్రేలియా, జపాన్‌ కలిసి క్వాడ్‌ (QUAD) కూటమిగా ఏర్పడడాన్ని డ్రాగన్‌ దేశం మరోసారి తప్పుబట్టింది.

‘‘కొంతకాలంగా కొన్ని దేశాలు చైనాపై దాడి చేయడంలోనే నిమగ్నమై ఉన్నాయి. అంతేకాకుండా ప్రపంచానికి ‘చైనా ముప్పు’ ఉందంటూ ప్రచారం చేస్తున్నాయి’’ అని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి హువా చున్‌యింగ్‌ పేర్కొన్నారు. అలాంటి దేశాలు ప్రచ్ఛన్న యుద్ధం మనస్తత్వాన్ని విడిచిపెట్టి.. ప్రత్యేక కూటముల కోసం వెతకడం మానేయాలని హితవు పలికారు. ఇందులో భాగంగా క్వాడ్‌ శిఖరాగ్ర సమావేశాన్ని చైనా గమనించిందన్నారు. అనంతర పరిస్థితులను కూడా నిశితంగా గమనిస్తున్నామని చున్‌యింగ్‌ చెప్పుకొచ్చారు.

శ్వేతసౌధంలో సెప్టెంబర్‌ 24న క్వాడ్‌ శిఖరాగ్ర సదస్సు జరిగిన విషయం తెలిసిందే. ఆ కూటమి దేశాధినేతలైన అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్‌ మోరిసన్‌, జపాన్‌ ప్రధాని యోషిహిడె సుగా, భారత ప్రధాని మోదీ వర్చువల్‌ విధానంలో కాకుండా నేరుగా తొలిసారి భేటీ అయ్యారు. కొవిడ్‌, పర్యావరణ మార్పులు, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో ఎదురవుతున్న సవాళ్లు సహా పలు అంశాలపై వారు చర్చించారు. ముఖ్యంగా చైనా దూకుడు కట్టడి వేసే వ్యూహాలను కూడా చర్చించినట్లు సమాచారం. కేవలం ఈ అంశాలపైనే కాకుండా ప్రపంచ శాంతికి క్వాడ్‌ కూటమి బాటలు పరుస్తుందని నాలుగు దేశాల అధినేతలు విశ్వాసం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ శ్రేయస్సుకు ఈ కూటమి ఎంతగానో తోడ్పడుతుందని పేర్కొన్నారు. అయితే, నాలుగు శక్తివంతమైన దేశాలు బృందంగా ఏర్పడడాన్ని మాత్రం చైనా జీర్ణించుకోలేకపోతోంది. తమకు వ్యతిరేకంగా వ్యూహాలు రచిస్తున్నారనే ఆందోళనకు గురవుతోన్న చైనా.. క్వాడ్‌ కూటమిపై విమర్శలు చేస్తూనే ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని