
Afghanistan: కాబూల్ విమానాశ్రయంలో తొక్కిసలాట: ఏడుగురి మృతి
కాబుల్ : తాలిబన్ల అధీనంలోకి వెళ్లిన అఫ్గానిస్థాన్‌లో పరిస్థితులు దయనీయంగా మారుతున్నాయి. విదేశాలకు శరణార్థులుగా వెళ్లాలనుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. బతుకు జీవుడా అంటూ అమెరికా బలగాల అధీనంలో ఉన్న కాబుల్ విమానాశ్రయానికి అక్కడి ప్రజలు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో కొంతమంది తాలిబన్ల చేతికి చిక్కి ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు వెలుగుచూస్తున్నాయి.
ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆదివారం కాబుల్ విమానాశ్రయం వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు అఫ్గాన్ పౌరులు మరణించినట్లు బ్రిటన్ రక్షణ మంత్రి బెన్ వాలేస్ వెల్లడించారు. వేలాది మంది విమానాశ్రయానికి తరలివస్తున్న క్రమంలో గందరగోళ పరిస్థితులు తలెత్తి ప్రజలు ఒక్కసారిగా పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది.
కాబుల్‌లో క్షేత్రస్థాయి పరిస్థితులు సవాల్ విసురుతున్నాయని బెన్ వాలేస్ తెలిపారు. పరిస్థితుల్ని శాంతియుతంగా అత్యంత భద్రతా పరిస్థితుల మధ్య చక్కబెట్టేందుకు కావాల్సిన చర్యల్నీ చేపడుతున్నామన్నారు. అయితే, అమెరికా నిర్దేశించిన ఆగస్టు 31వ తేదీ లోపు విదేశీయులందరినీ అఫ్గాన్ నుంచి తరలించడం సాధ్యం కాకపోవచ్చునని అభిప్రాయపడ్డారు. మరికొంత కాలం ఉండేందుకు అమెరికన్లకు అనుమతి లభించే అవకాశం ఉందన్నారు. ఇదే జరిగితే.. బ్రిటన్ తరఫున పూర్తి సహాయ సహకారం ఉంటుందన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.