
Mann Ki Baat: దేశయువత ఆలోచన ధోరణి మారింది..
మన్ కి బాత్‌లో ప్రధాని మోదీ
దిల్లీ: దేశంలో స్టార్టప్ సంస్కృతి చాలా శక్తివంతంగా మారిందని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కేవలం నగరాలకే కాకుండా చిన్న పట్టణాల్లోనూ ఈ తరహా కల్చర్ మరింత పెరిగిందని.. ఇది దేశ యువత ఉజ్వల భవిష్యత్తును సూచిస్తోందన్నారు. దేశ యువత ఆలోచన ధోరణి మారిందన్న మోదీ.. నూతనంగా, భారీ స్థాయిలో ఏదైనా చేయాలనే తపన వారిలో పెరిగిందని ప్రశంసించారు. మన్ కీ బాత్ (Mann Ki Baat) కార్యక్రమంలో ప్రసంగించిన నరేంద్ర మోదీ, అంతరిక్ష రంగంలో వస్తోన్న సంస్కరణలు యువత దృష్టిని ఎంతగానో ఆకర్షించాయని చెప్పారు.
మన్ కీ బాత్‌లో భాగంగా భారత ఆధ్యాత్మిక సంప్రదాయాల గొప్పతనాన్ని ప్రధాని మోదీ మరోసారి ప్రస్తావించారు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారుల ప్రతిభకు లభించిన ప్రోత్సాహాన్ని ఆయన గుర్తుచేశారు. భారత హాకీ లెజెండ్ ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పించిన మోదీ.. దేశం కోసం ఆయన హాకీ ప్రపంచాన్నే జయించారన్నారు. ప్రస్తుతం దేశంలో క్రీడల పట్ల యువతకు ఎంతో ఆసక్తి పెరిగిందని.. ఇదే క్రీడా స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్లేలా వారిని ప్రోత్సహించాలన్నారు,. ఇందులో భాగంగా గ్రామీణ స్థాయిలో క్రీడా పోటీలను నిర్వహించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ధ్యాన్‌చంద్ పుట్టినరోజు పురస్కరించుకొని ప్రతిఏటా ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్న విషయం తెలిసిందే.
ఇక దేశంలో కొవిడ్ వైరస్ మహమ్మారి విజృంభిస్తోన్న వేళ స్వచ్ఛభారత్ ఉద్యమాన్ని కొనసాగించాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 62కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని.. అయినప్పటికీ పౌరులు మరింత అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని సూచించారు.