
Farm Laws: రైతులపై కేసులు.. ఉపసంహరణ నిర్ణయం ఆయా రాష్ట్రాలదే!
కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి తోమర్
భోపాల్: సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన రైతన్నలపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవడంపై ఆయా రాష్ట్రాలదే నిర్ణయమని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ పేర్కొన్నారు. శాంతి భద్రతల విషయం రాష్ట్రాలదే అయినందున వాటిపై తుది నిర్ణయం కూడా వారిదేనని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా రైతులు తమ ఆందోళనలను విరమించుకోవడాన్ని కేంద్రమంత్రి స్వాగతించారు. మధ్యప్రదేశ్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. కేంద్రం విడుదల చేసే నగదు ఎలాంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా లబ్ధిదారులకే చేరుతోందని ఉద్ఘాటించారు.
వ్యవసాయ చట్టాల రద్దు నేపథ్యంలో ఉద్యమ సమయంలో వారిపై నమోదైన కేసులతో పాటు కనీస మద్దతు ధరపై రైతుల డిమాండ్లను అంగీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం రైతుసంఘాల నేతలకు ఓ లేఖ రాసింది. ‘రైతులపై నమోదైన కేసులను ఉపసంహరించుకుంటామని ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌తో పాటు హరియాణా రాష్ట్రాలు అంగీకరించాయి. దిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లో నమోదైన కేసులను కూడా ఉపసంహరించుకుంటాం’ అని కేంద్ర ప్రభుత్వం ఆ లేఖలో పేర్కొంది. అయితే, వీటిపై ఆయా రాష్ట్రాలు మాత్రమే ప్రకటన చేస్తాయని వెల్లడించింది. ఇక ఏడాది కాలంగా రైతు నేతలతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నానన్న కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి తోమర్.. ఇది ఎవరి విజయమో? ఓటమో కాదన్నారు.
ఇదిలాఉంటే, నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు చేసిన ఆందోళన దాదాపు సంవత్సరం పాటు కొనసాగింది. గతేడాది నవంబర్ 26న మొదలైన ఉద్యమం ఏడాది పూర్తి చేసుకునే సమయంలోనే వాటిని రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన బిల్లులను కూడా నవంబర్ 29న పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.