Updated : 30 Dec 2021 14:48 IST

Omicron: సునామీలా కరోనా కొత్త కేసులు.. హెచ్చరిస్తూనే, భరోసా ఇస్తున్న వైద్యనిపుణులు..!

ఇంటర్నెట్‌ డెస్క్: కరోనా వైరస్‌ డెల్టా కంటే వేగంగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ వ్యాపిస్తుండటంతో కేసుల సంఖ్య సునామీ వలే వైద్య వ్యవస్థను ముంచెత్తనుంది. గత వారంలో ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా రోజువారీ కేసులు పెరగడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. డెల్టా వేరియంట్ నుంచి పూర్తిగా తేరుకోని ప్రపంచాన్ని.. ఇప్పుడు ఒమిక్రాన్ చుట్టేసింది. అమెరికా, ఫ్రాన్స్‌, యూకే, డెన్మార్క్‌లో రికార్డు స్థాయిలో కేసులు నమోదవున్నాయి. భారత్‌లో కూడా ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోంది. కొత్త కేసులు హఠాత్తుగా పెరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ఇలాంటి పరిస్థితే ఉంది.

‘డెల్టా వ్యాప్తి కొనసాగుతోన్న సమయంలోనే ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తూ.. కేసుల సునామీని సృష్టిస్తోంది. ఇది తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇది వైద్య వ్యవస్థలు, ఇప్పటికే అలసిపోయి ఉన్న వైద్య సిబ్బందిని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టేస్తోంది’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధినేత టెడ్రోస్ అధనామ్ వ్యాఖ్యానించారు.

ఆక్సిజన్ సిలిండర్లను నిల్వచేయవద్దు.. 

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా ప్రజలకు ఓ విజ్ఞప్తి చేశారు. ముందస్తుగా ఆక్సిజన్‌, ఔషధాలను నిల్వ చేసుకోవడం మానుకోవాలని కోరారు. కొవిడ్ ఎలాంటి పరిస్థితుల్ని సృష్టించినా.. ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఇప్పటి వరకు వెల్లడైన అధ్యయనాల ప్రకారం ఒమిక్రాన్‌ సోకితే స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నాయి. అందువల్ల మెడికల్ ఆక్సిజన్ అవసరం పెద్దగా ఉండకపోవచ్చన్నారు. కొత్త సంవత్సరంలో ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. మహమ్మారి ఇంకా ముగిసిపోలేదని అంతా గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ప్రజలంతా తప్పకుండా కొవిడ్ నియమావళిని పాటించాలని సూచించారు.

ఆక్స్‌ఫర్డ్ నిపుణుడు ఏం చెప్పారంటే..

నవంబర్‌లో దక్షిణాఫ్రికాలో మొదట గుర్తించిన ఈ వేరియంట్ తక్కువ తీవ్రతను కలిగి ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. ఆసుపత్రుల్లో ఉండాల్సిన సమయమూ తక్కువగానే ఉందని నిపుణులు అంటున్నారు. వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉన్న ఒమిక్రాన్.. గత ఏడాది చూసిన కరోనా వంటిది కాదని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన ఇమ్యునాలజిస్ట్ జాన్‌ బెల్ వెల్లడించారు. ‘ఐసీయూలు నిండిపోవడం, కొవిడ్ బాధితుల అకాల మరణాలు.. గత ఏడాది మనం చూసిన ఆ భయానక దృశ్యాలు ఇప్పుడు నా దృష్టిలో చరిత్ర. ఆ పరిస్థితి పునరావృతం అయ్యే అవకాశం లేదని మనకు మనం భరోసా ఇచ్చుకోవాలి’ అని బెల్‌ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తాము కొవిడ్ కఠిన నిబంధనలు తీసుకురాబోమని యూకే ప్రధాని ప్రకటించిన తర్వాత బెల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇదిలా ఉండగా.. సునామీలా పెరుగుతున్న కేసులకు తగ్గట్టే మరణాలు లేకపోవడం ఊరటనిస్తోంది. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా 50 లక్షలకు పైగా మరణాలు సంభవించాయి. అయితే, గత వారంలో మరణాలు రోజుకు సగటున 6,450గా ఉన్నాయి. 2020 అక్టోబర్ తర్వాత ఇదే అతి తక్కువని ఓ వార్తా సంస్థ నివేదించింది. 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని