Omicron Vs Delta: ఒమిక్రాన్‌ యాంటీబాడీలతో డెల్టాను ఎదుర్కొనే సామర్థ్యం..!

ఒమిక్రాన్‌ బారినపడి కోలుకున్న వారిలో డెల్టా వేరియంట్‌ను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి ఎక్కువగానే ఉంటున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది.

Published : 30 Dec 2021 18:12 IST

జోహన్నస్‌బర్గ్‌: అత్యంత వేగంతో వ్యాపిస్తున్నట్లు భావిస్తున్న ఒమిక్రాన్‌ ప్రభావం, వ్యాధి తీవ్రతను తెలుసుకునేందుకు పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా ఒమిక్రాన్‌ బారినపడి కోలుకున్న వారిలో డెల్టా వేరియంట్‌ను ఎదుర్కొనే రోగనిరోధక సామర్థ్యం పెరుగుతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. అంతేకాకుండా డెల్టాతో రీ-ఇన్‌ఫెక్షన్‌ బారినపడే అవకాశాలు తగ్గుతున్నట్లు గుర్తించారు. వీటికితోడు రానున్న మరికొన్ని రోజుల్లోనే డెల్టాను ఒమిక్రాన్‌ అధిగమించే అవకాశం ఉన్నట్లు తాజా అధ్యయన ఫలితాలను బట్టి చూస్తే అర్థమవుతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఈ ఏడాది నవంబర్‌లో దక్షిణాఫ్రికా బోట్స్‌వానాలో కరోనా కొత్తరకమైన ఈ ఒమిక్రాన్‌ వేరియంట్‌ వెలుగు చూసింది. విస్తృత వేగంతో వ్యాప్తి చెందడంతోపాటు వ్యాక్సిన్‌, మునుపటి ఇన్‌ఫెక్షన్‌ నుంచి పొందిన రోగనిరోధక శక్తి నుంచి తప్పించుకునే సామర్థ్యం దీనికి ఉన్నట్లు ఇప్పటివరకు వచ్చిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 130 దేశాలకు విస్తరించింది. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్‌ తీవ్రతను అంచనా వేసేందుకు ఆఫ్రికా హెల్త్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (AHRI) నిపుణులు ఓ అధ్యయనాన్ని చేపట్టారు. ఇందుకోసం ఒమిక్రాన్‌ సోకిన 15 మందిని పరిగణనలోకి తీసుకున్నారు. వీరిలో వ్యాక్సిన్‌ తీసుకున్న, తీసుకోని వారు కూడా ఉన్నారు. వీరి నుంచి ప్లాస్మాను సేకరించిన పరిశోధకులు.. ఒమిక్రాన్‌, డెల్టా వేరియంట్‌పై ఈ యాంటీబాడీల పనితీరును విశ్లేషించారు. వీరిలో ఒమిక్రాన్‌ను తటస్థీకరించే సామర్థ్యం 14 రెట్లు ఉన్నట్లు గుర్తించారు. వీటితోపాటు డెల్టాను తటస్థీకరించే సామర్థ్యం కూడా 4.4 రెట్లు ఎక్కువ ఉందని కనుగొన్నారు. తద్వారా సాధారణ ప్రజలతో పోలిస్తే వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో డెల్టాను ఎదుర్కొనే సామర్థ్యం అధికంగా ఉన్నట్లు నిరూపితమైందని దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

ఒమిక్రాన్‌ సోకిన వ్యక్తుల్లో డెల్టాను తటస్థీకరించే సామర్థ్యం అధికంగా ఉందంటే.. వారిలో రీఇన్‌ఫెక్షన్‌ వచ్చే అవకాశాలు తక్కువేనని పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్తలు వెల్లడించారు. అంతేకాకుండా ఒకవేళ ఒమిక్రాన్‌ తీవ్రత తక్కువ ఉందని తేలిందంటే మాత్రం రానున్న రోజుల్లో మహమ్మారి దశ మారుతున్నట్లేనని అభిప్రాయపడ్డారు. అయితే, కొద్దిస్థాయిలో జరిపిన ఈ అధ్యయన ఫలితాలను విశ్లేషణ కోసం ఓ జర్నల్‌లో ప్రచురించినట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని