Supreme Court: న్యాయమూర్తులకు బెదిరింపులు తీవ్రమైన అంశం: సుప్రీంకోర్టు

దేశంలో న్యాయమూర్తులకు బెదిరింపులు రావడం తీవ్రమైన అంశమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

Updated : 06 Aug 2021 13:34 IST

దిల్లీ: దేశంలో న్యాయమూర్తులకు బెదిరింపులు రావడం తీవ్రమైన అంశమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. జులై 28న ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో జిల్లా న్యాయమూర్తి ఉత్తమ్‌ ఆనంద్‌ను దుండగులు ఆటోతో ఢీకొట్టి హత్య చేశారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానాలు, జడ్జిల రక్షణ అంశాన్ని సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు.. శుక్రవారం దీనిపై విచారణ చేపట్టింది. న్యాయాధికారులకు కల్పిస్తున్న రక్షణపై ఈనెల 17లోపు నివేదికను సమర్పించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

జడ్జి హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగించినట్లు ఝార్ఖండ్‌ ప్రభుత్వం తరఫు న్యాయవాది వివరించగా ఆ ప్రభుత్వంపై ధర్మాసనం మండిపడింది. సీబీఐ కేసు విచారణ ప్రారంభించిందని మీరు చేతులు దులుపుకొన్నారా? అని ప్రశ్నించింది. జడ్జిలకు గ్యాంగ్‌స్టర్లు, ఉన్నతస్థాయి వ్యక్తుల నుంచి బెదిరింపులు వస్తున్నట్లుగా అనేక ఉదాహరణలు ఉన్నాయని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌కు గుర్తు చేసింది. ఫిర్యాదులు చేయడానికి కూడా జడ్జిలకు స్వేచ్ఛ ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. అలాంటి ఫిర్యాదులు దాఖలైతే న్యాయవ్యవస్థకు పోలీసులు, సీబీఐ కూడా సాయం చేయడం లేదని తెలిపింది. 2019లో ఓ జడ్జిపై దాడి సందర్భంలో జారీ చేసిన నోటీసులకు కేంద్రం సమాధానం ఇవ్వాల్సి ఉన్నా.. ఇప్పటిదాకా స్పందించలేదని సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అన్నారు. దీనిపై వారంలోపు సమాధానం ఇవ్వాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఆగస్టు 9కి వాయిదా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని