Lakhimpur kheri violence: 10 రోజుల గడువు ఇస్తే.. ఈ నివేదికా మీరు ఇచ్చేది..?

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లఖింపుర్‌ ఖేరి ఘటన విచారణలో ఏ మాత్రం పురోగతి కనిపించడం లేదని నేడు సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. విచారణ తాము ఆశించిన రీతిలో లేదని వ్యాఖ్యానించింది.

Updated : 08 Nov 2021 13:35 IST

నిందితుడికి అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయన్న సుప్రీం

దిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లఖింపుర్‌ ఖేరి ఘటన విచారణలో ఏ మాత్రం పురోగతి కనిపించడం లేదని సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. తాము ఆశించిన రీతిలో విచారణ లేదని వ్యాఖ్యానించింది. రెండు ఎఫ్ఐఆర్‌లను కలిపి విచారించడాన్ని చూస్తుంటే.. నిందితుడికి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోందని ఘాటుగా స్పందించింది. సుమారు పది రోజుల తర్వాత సోమవారం మరోసారి ఈ కేసుపై కోర్టులో విచారణ జరిగింది.

‘మరికొంత మంది సాక్షుల్ని విచారించాం అనే మాట తప్ప నివేదికలో ఏమీ లేదు. ఇప్పటికీ 10 రోజుల సమయం ఇచ్చాం. ఇంతవరకు ల్యాబ్ నుంచి రిపోర్ట్స్‌ రాలేదు. ఇది కాదు మేం ఆశించింది’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ యూపీ ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే ఎంతమందిని ఏఏ ఆరోపణలతో అరెస్టు చేశారో ఆ నివేదికలో వెల్లడించాలని ఆదేశించారు. ఈ కేసులో రెండు ఎఫ్ఐఆర్‌లను కలిపి(ఓవర్‌ల్యాప్‌) విచారించడాన్ని కోర్టు ప్రస్తావించింది. ‘రెండు ఎఫ్‌ఐఆర్‌లను కలిపి నిందితుడికి అనుకూలమైన పరిస్థితుల్ని కల్పిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ విషయం చెప్పడానికి మేం చింతిస్తున్నాం. ఈ రెండింటిలో ఒకటి రైతుల హత్యది కాగా, రెండోది రాజకీయ కార్యకర్తలు, జర్నలిస్టు హత్యలకు సంబంధించింది. రెండింటిని విడిగా విచారించాలి. ఈ కేసులో సాక్ష్యాలు కలిసిపోకుండా చూసేందుకు విచారణ పర్యవేక్షణ నిమిత్తం హైకోర్టు మాజీ న్యాయమూర్తిని నియమించాలని భావిస్తున్నాం’ అని కోర్టు వెల్లడించింది. అలాగే నిందితుడికి అనుకూలంగా ఉన్న వాంగ్మూలాలు మాత్రమే రికార్డయ్యాయని అసహనం వ్యక్తం చేసింది.

రెండు ఎఫ్‌ఐఆర్‌లను విడిగా విచారించేందుకు ప్రయత్నించినా.. సాక్షులు రెండు ఘటనల గురించి ప్రస్తావించడంతో విడిగా విచారించడం క్లిష్టమవుతోందని యూపీ ప్రభుత్వ తరఫు న్యాయవాది వెల్లడించారు. అలాగే ఆ రోజు మరణించిన జర్నలిస్టు కేంద్రమంత్రి తనయుడి బృందంలోని వ్యక్తో కాదో తెలియకపోవడం ఈ పరిస్థితికి కారణమన్నారు. 

గత నెల ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌లో రైతులు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తోన్న సమయంలో కేంద్ర మంత్రి తనయుడు ఆశిశ్ మిశ్రా వాహన శ్రేణి వారి మీద నుంచి దూసుకెళ్లింది. దాంతోపాటుగా అక్కడ జరిగిన ఘటనల్లో నలుగురు రైతులతో సహా ఎనిమిది మంది మరణించారు. వారిలో ఒక జర్నలిస్టు కూడా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే ఆశిశ్‌ మిశ్రాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోపక్క ఈ కేసు దర్యాప్తులో యూపీ ప్రభుత్వం చురుగ్గా వ్యవహరించడం లేదని సుప్రీం భావిస్తోంది. దీనిపై ఇప్పటికే ఆ రాష్ట్రానికి చురకలు అంటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని