
Delhi Pollution: పాకిస్థాన్ పరిశ్రమలపై నిషేధం విధించాలంటున్నారా..?
దిల్లీ కాలుష్యంపై సుప్రీంలో విచారణ
దిల్లీ: దేశ రాజధాని నగరం దిల్లీ వాయు కాలుష్య కోరల్లో చిక్కుకుంది. దాంతో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు శుక్రవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అలాగే టాస్క్‌ఫోర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్‌కు ప్రత్యేక అధికారాలు ఇచ్చినట్లు వెల్లడించింది.
గురువారం దిల్లీ కాలుష్యంపై జరిగిన విచారణలో భాగంగా కేంద్రం, దిల్లీ ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజధానిలో కాలుష్య నివారణకు క్షేత్రస్థాయి చర్యలు ఏమీ కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. దీని నివారణకు తీసుకోనున్న చర్యలపై 24 గంటల్లోగా సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. దానిలో భాగంగా దిల్లీ ప్రభుత్వం ఈ రోజు నుంచి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. అయితే ఆసుపత్రుల నిర్మాణ కార్యకలాపాలకు మాత్రం అనుమతి కోరింది.
విలన్లుగా చిత్రీకరిస్తున్నారు..
పాఠశాలల మూసివేతపై మీడియాలో వచ్చిన వార్తలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ స్పందించారు. తాము దిల్లీలో నిరవధికంగా పాఠశాలలు మూసివేయాలని ఆదేశించలేదన్నారు. కాలుష్య స్థాయులు అధికంగా ఉన్న సమయంలో పెద్దలు ఇంటినుంచి పనిచేస్తుంటే పిల్లలు పాఠశాలకు వెళ్లడంపై మాత్రమే ప్రశ్నించామన్నారు. కానీ ఈ విషయంపై కొన్ని మీడియా సంస్థలు తమను విలన్లుగా చిత్రీకరిస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థుల సంక్షేమం గురించి పట్టదని ప్రచారం చేస్తున్నాయన్నారు. పాఠశాలల మూసివేత పూర్తిగా దిల్లీ ప్రభుత్వ నిర్ణయమన్నారు.
పాకిస్థాన్ పరిశ్రమలపై నిషేధం విధించమని కోరుతున్నారా..?
దిల్లీ కాలుష్యం విషయంలో ఉత్తర్‌ప్రదేశ్ పాత్ర లేదని ఆ రాష్ట్రం కోర్టులో వాదనలు వినిపించింది. పాకిస్థాన్ నుంచి వస్తోన్న కాలుష్యం దిల్లీ పరిస్థితికి కారణమని వాదించింది. దీనిపై సుప్రీం స్పందిస్తూ.. ‘మేం పాకిస్థాన్ పరిశ్రమలపై నిషేధం విధించాలని మీరు కోరుకుంటున్నారా..?’ అంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది.
గత కొద్దివారాలుగా దిల్లీ వాయు కాలుష్య సంక్షోభంలో చిక్కుకుపోయింది. ఒకవైపు కేంద్రం, దిల్లీ ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. పరిస్థితి మాత్రం అదుపులోకి రాలేదు. ఈ క్రమంలోనే సోమవారం నుంచి వరుసగా ఐదురోజులుగా ఈ అంశంపై సుప్రీం వాదనలు వింటోంది.