Kabul Blasts: శరీరభాగాలు గాల్లోకి ఎగిరిపడ్డాయి.. నీళ్లు ఎర్రగా మారాయి!

కాబుల్ విమానాశ్రయంపై జరిగిన జంట ఆత్మాహుతి దాడులతో ఆ ప్రాంతమంతా భీతావహ దృశ్యాలతో నిండిపోయింది. ఇంతసేపు తమ పక్కనే ఉన్న వ్యక్తులు.. తునకాతునకలుగా మారిపోవడం అక్కడివారిని తీవ్రంగా కలచివేచింది. సుడిగాలులకు ప్లాస్టిక్ కవర్లు గాల్లోకి లేచినట్లు, శరీరభాగాలు ఎగిరిపడ్డాయి. ఈ హఠాత్పరిణామానికి అక్కడివారు భయభ్రాంతులకు గురయ్యారు. ఇమ్మిగ్రేషన్ వీసాపై యూఎస్ వెళ్తోన్న ఓ వ్యక్తి తన కళ్లెదుట జరిగిన దారుణం గురించి మీడియా ఎదుట వాపోయారు.

Updated : 27 Aug 2021 16:38 IST

కాబుల్: కాబుల్ విమానాశ్రయంపై జరిగిన జంట ఆత్మాహుతి దాడులతో ఆ ప్రాంతమంతా భీతావహ దృశ్యాలతో నిండిపోయింది. అప్పటివరకూ తమ పక్కనే ఉన్న వ్యక్తులు.. తునకాతునకలుగా మారిపోవడం అక్కడి వారిని తీవ్రంగా కలచివేచింది. సుడిగాలులకు ప్లాస్టిక్ కవర్లు గాల్లోకి లేచినట్లు, శరీరభాగాలు ఎగిరిపడ్డాయి. ఈ హఠాత్పరిణామానికి అక్కడి వారంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఇమ్మిగ్రేషన్ వీసాపై యూఎస్ వెళ్తోన్న ఓ వ్యక్తి తన కళ్లెదుట జరిగిన దారుణం గురించి మీడియా ఎదుట వాపోయారు.

‘ఒక్కసారిగా నా కింద భూమి కంపించినట్లైంది. పెద్దపెట్టున వచ్చిన శబ్దాలకు కొద్దిసేపటివరకూ నాకేం వినిపించలేదు. అసలేం జరుగుతుందో అర్థం కాలేదు. సుడిగాలులకు ప్లాస్టిక్ కవర్లు గాల్లోకి లేచినట్లు.. శరీర భాగాలు ఎగిరిపడ్డాయి. మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రపంచం అంతమయ్యే రోజును ఎవరు చూడలేరు. కానీ నేనీరోజు దాన్ని చూశాను. మృతదేహాలు రోడ్డు, మురుగుకాలువలో పడిపోయాయి. ఆ కాలువలోని కొద్దిపాటి నీరు ఎర్రగా మారిపోయింది’ అని ఆ వ్యక్తి భయంతో వణికిపోయారు. తన వివరాలు చెప్పడానికి మాత్రం నిరాకరించారు.  ‘శారీరకంగా నేను బాగానే ఉన్నా. మానసికంగా కలిగిన ఈ గాయం మాత్రం జీవితాంతం ఉండిపోతుంది. ఈ పేలుళ్లతో నేను ఎప్పటికీ మామూలుగా ఉండలేను’ అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 

గురువారం సాయంత్రం కాబుల్ విమానాశ్రయంపై జరిగిన జంట ఆత్మాహుతి దాడుల్లో మృతుల సంఖ్య 100 దాటింది. ఈ దాడిలో 90 మంది అఫ్గాన్ వాసులు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారి సంఖ్య 150కి చేరింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని