Afghanistan: తాలిబన్ల ఆధీనంలోకి కాందహార్‌ నగరం

అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల ఆక్రమణలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఆ దేశంలోని పలు నగరాలను ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లు.. తాజాగా

Updated : 13 Aug 2021 10:05 IST

కాబుల్‌: అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల ఆక్రమణలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఆ దేశంలోని పలు నగరాలను ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లు.. తాజాగా కాందహార్‌ను తమ నియంత్రణలో పెట్టుకున్నారు. అఫ్గానిస్థాన్‌లో రాజధాని కాబూల్‌ తర్వాత దేశంలో ఇదే అతిపెద్ద నగరం కావడం గమనార్హం. దీంతో పాటు మూడో అతిపెద్ద నగరమైన హెరత్‌ను కూడా తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కాందహార్‌, హెరత్‌ వంటి పెద్ద నగరాలను కోల్పోవడం అఫ్గాన్‌ సేనలకు గట్టి ఎదురుదెబ్బే!

ఇక దేశంలో దాదాపు సగభాగం ఇప్పటికే తాలిబన్ల నియంత్రణలోకి వెళ్లిపోయింది. అఫ్గాన్‌ వ్యాప్తంగా 34 ప్రావిన్షియల్‌ రాజధానులుండగా అందులో 12 తాలిబన్ల గుప్పిట్లోకి వెళ్లిపోయాయి. ఇప్పటికే దేశ రాజధాని కాబూల్‌కు సమీపంలోని ఘాజ్నీ నగరాన్ని వారు హస్తగతం చేసుకున్నారు. కాబుల్‌-కాందహార్‌ హైవేలో ఉన్న ఈ నగరం... దేశ రాజధానిని, దక్షిణాది రాష్ట్రాలనూ కలుపుతుంది. ఈ నగరం తాలిబన్ల చేతిలోకి వెళ్లడంతో అఫ్గాన్‌ సైనికుల రవాణాకు కష్టతరమవుతుంది.

గత వారం రోజుల నుంచి అఫ్గాన్‌లో తాలిబన్ల దురాక్రమణలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశాన్ని కాపాడుకునేందుకు అక్కడి ప్రభుత్వం తాలిబన్లతో సంధి కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. హింసను పక్కనపెడితే సయోధ్యకు సిద్ధమని ప్రతిపాదన పంపింది. ఆ ప్రతిపాదనపై తాలిబన్ల ప్రతిస్పందన కోసం అఫ్గానిస్థాన్‌ ప్రభుత్వం నిరీక్షిస్తోంది. 

పౌరులు, సిబ్బందిని తీసుకెళ్తోన్న ఇతర దేశాలు

అఫ్గాన్‌లో ఉద్రిక్తతల దృష్ట్యా ఆ దేశంలో ఉన్న తమ పౌరులు, సిబ్బందిని తీసుకొచ్చేందుకు అమెరికా, యూకే సిద్ధమయ్యాయి. కాబూల్‌లోని అమెరికా రాయబార కార్యాలయం నుంచి సిబ్బందిని తరలించేందుకు అమెరికా 3000 మంది బలగాలను పంపించేందుకు సన్నాహాలు చేస్తోంది. అటు యూకే కూడా 600 మంది బలగాలను నియమిచింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని