Tamil Nadu: ఆదివారం పూర్తి లాక్‌డౌన్‌.. రేపట్నుంచే నైట్‌కర్ఫ్యూ!

దేశంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. వైరస్ వ్యాప్తి కట్టడికి పలు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఆదివారాల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించనున్నట్లు తాజాగా తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.

Published : 05 Jan 2022 22:56 IST

తమిళనాడు ప్రభుత్వం ప్రకటన 

చెన్నై: దేశంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. వైరస్ వ్యాప్తి కట్టడికి పలు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఆదివారాల్లో లాక్‌డౌన్ విధించనున్నట్లు తాజాగా తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై తమిళనాడు ఆరోగ్య మంత్రి మా సుబ్రమణియన్ మాట్లాడుతూ..‘ఆదివారాలు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌లోకి వెళ్లాల్సి ఉన్నందున.. మెగా వ్యాక్సినేషన్ క్యాంపుల్ని శనివారం నిర్వహించనున్నాం’ అని తెలిపారు. ఆంక్షలకు సంబంధించిన వివరాలపై అధికారిక ప్రకటన వెలువడనుందని తెలిపారు. జనవరి 6 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి 10గంటల నుంచి ఉదయం 5గంటల వరకు రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని సీఎం ఎంకే స్టాలిన్‌ ఆదేశించారు. జనవరి 9న (ఆదివారం) పూర్తిగా లాక్‌డౌన్‌ అమలుచేయనున్నారు. అలాగే, బస్సులు, సబర్బన్‌ రైళ్లు, మెట్రో రైళ్లలో 50శాతం ఆక్యుపెన్సీతో నడిపేందుకు అవకాశం కల్పించారు. ఎంటర్‌టెయిన్‌మెంట్, అమ్యూజ్‌మెంటు పార్కులను మూసివేయనున్నారు. వారంలో మూడు రోజులు (శుక్ర, శని, ఆదివారం) అన్ని ప్రార్థనా మందిరాలకు ప్రజల్ని అనుమతించబోమని అధికారులు పేర్కొన్నారు. 

24 గంటల వ్యవధిలో తమిళనాడులో 2,731 మందికి కరోనా సోకింది. 9 మంది మరణించారు. చెన్నైతో సహా ఐదు జిల్లాల్లో కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం మొత్తం కేసుల సంఖ్య 27,55,587కి చేరిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 36,805 మరణాలు సంభవించాయి.  కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు 121కి చేరాయి. 

ఇక దేశంలో కరోనావైరస్ మరోసారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. శరవేగంగా విస్తరిస్తూ.. తన ప్రతాపాన్ని చూపిస్తోంది. రెండు రోజులుగా 30వేలకు పైగా నమోదయిన కొత్త కేసులు.. నేడు ఒక్కసారిగా 58 వేలకు చేరాయి. ముందురోజు కంటే 55 శాతం అధికంగా నమోదయ్యాయి. వేగంగా ప్రబలే లక్షణమున్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ తాజా వ్యాప్తికి దోహదం చేస్తోంది. ప్రస్తుతం ఒమిక్రాన్‌ కేసులు రెండు వేల మార్కు దాటేశాయి. భారత్‌లో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని, వచ్చే రెండు వారాల్లో గరిష్ఠ స్థాయికి చేరొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్య శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని