Tejashwi Yadav: రేచల్ నుంచి రాజ్యశ్రీగా మారిన తేజస్వి సతీమణి.. లాలూ సూచించారట..!

 బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు, ఆర్జేడీకి చెందిన ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ ఇటీవల ఓ ఇంటివారయ్యారు. తన హోదాకు తగ్గట్టుగా కాకుండా.. నిరాడంబరంగా పెళ్లి చేసుకొని ఆశ్చర్యపర్చారు.

Updated : 14 Dec 2021 14:56 IST

తన వివాహ వేడుకపై స్పందించిన ఆర్జేడీ నేత

పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు, ఆర్జేడీకి చెందిన ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ ఇటీవల ఓ ఇంటివారయ్యారు. నిరాడంబరంగా పెళ్లి చేసుకొని ఆశ్చర్యపర్చారు. అతి కొద్దిమంది ఆత్మీయుల సమక్షంలోనే ఈ వేడుక జరిగింది. డిసెంబర్ 9న జరిగిన ఈ వివాహంపై తేజస్వి పట్నాలో మీడియాతో మాట్లాడారు.

‘నేను, నా భార్య ఈ వివాహ వేడుకను కుటుంబ సభ్యుల మధ్యే జరుపుకోవాలని నిర్ణయించుకున్నాం. అప్పుడే ఇరు కుటుంబాలకు చెందినవారు ఆత్మీయంగా మాట్లాడుకోవడానికి వీలుకుదురుతుందని భావించాం. ప్రధాని, ఇతర ప్రముఖ నేతలు వివాహానికి హాజరైతే.. అందుకు తగ్గ ఏర్పాట్లపైనే నిమగ్నమవ్వాల్సి ఉంటుంది. అతిథుల సంఖ్యను తగ్గించడానికి కరోనా ఆందోళన కూడా ఓ కారణం’ అని తేజస్వి మీడియాకు వెల్లడించారు.

అలాగే రిసెప్షన్ నిర్వహించనున్నట్లు.. త్వరలో ఆ వివరాలు వెల్లడిస్తామన్నారు. లాలూ మీద అభిమానంతో.. కొత్త కోడలిని ఆహ్వానించేందుకు పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చే అవకాశం ఉందని తెలిపారు. అందుకే తన సోదరుడి వివాహంలో మాదిరిగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా.. భారీ స్థాయిలో అతిథులకు ఆతిథ్యం ఇచ్చేలా వేదికను ఎంచుకోనున్నట్లు చెప్పారు.

రేచల్‌ నుంచి రాజ్యశ్రీగా..తేజస్వి భార్య పేరు రేచల్ గోడిన్హో. ప్రస్తుతం ఆమె పేరు మార్చుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఇప్పుడు తన భార్య పేరు రాజ్యశ్రీ అని, ఆ పేరును తన తండ్రి లాలూ సూచించారని తెలిపారు. బిహార్ ప్రజలు పిలిచేందుకు ఈ పేరు సులువుగా ఉంటుందన్నారు. యాదవ వర్గానికి చెందిన యువతిని కాకుండా వేరే వర్గానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడంపై తన మామ సాధు యాదవ్ చేసిన విమర్శలపై ఆయన స్పందించారు. ఆయన మాటలు గందరగోళంగా ఉన్నాయన్నారు. కొత్తతరం అలాంటి ఆలోచనల్ని వివక్షగా పరిగణించాలన్నారు. యువత సరికొత్త ఆలోచనాధోరణితో ఉందంటూ సమాధానమిచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని