Updated : 29/11/2021 20:38 IST

Shashi Tharoor: మహిళా ఎంపీలతో సెల్ఫీ.. వివాదాస్పదమైన శశిథరూర్‌ కామెంట్స్‌!

దిల్లీ: సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉండే కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ శశిథరూర్‌ అప్పుడప్పుడు వివాదాలకు కేంద్ర బిందువు కూడా అవుతుంటారు. తాజాగా మహిళా ఎంపీలపై చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. ‘మహిళా ఎంపీలు ఉండగా.. లోక్‌సభ ఆకర్షణీయ పనిప్రదేశం కాదని ఎవరన్నారు’ అంటూ ఆయన చేసిన కామెంట్‌పై ట్వీటర్‌ యూజర్లు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి స్పందించిన శశిథరూర్‌.. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని విజ్ఞప్తి చేశారు.

పార్లమెంటు శీతాకాల సమావేశాలు నేటి (నవంబర్‌ 29) నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా లోక్‌సభ ప్రాంగణానికి చేరుకున్న మహిళా ఎంపీలు.. తోటి సీనియర్‌ సభ్యుడు శశిథరూర్‌తో సెల్ఫీ దిగారు. వీరిలో సుప్రియా సూలే, ప్రణీత్‌ కౌర్‌, తమిజాచి తంగపాండియన్‌, మిమి చక్రవర్తి, నుస్రత్‌ జహాన్‌, జ్యోతిమణి ఉన్నారు. కొంతసేపటి తర్వాత దీనిని ట్విటర్‌లో షేర్‌ చేసిన శశిథరూర్‌.. లోక్‌సభ ఆకర్షణీయమైన పని ప్రదేశం కాదని ఎవరన్నారు? అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందించడంతో వివాదానికి దారితీసింది. ముఖ్యంగా మహిళలను అగౌరవపరిచే విధంగా శశిథరూర్‌ మాట్లాడారంటూ ఆయన తీరుపై కొందరు నెటిజన్లు మండిపడ్డారు. మహిళల పట్ల వివక్ష భావనతోనే శశిథరూర్‌ అలా వ్యాఖ్యానించారని విమర్శలు గుప్పిస్తున్నారు.

మండిపడ్డ మహిళా కమిషన్‌ ఛైరపర్సన్‌

శశిథరూర్‌ ట్విటర్‌ పోస్టుపై జాతీయ మహిళా కమిషన్‌ ఛైర్మన్‌పర్సన్‌ రేఖా శర్మ స్పందించారు. పార్లమెంటుతో పాటు రాజాకీయాల్లో క్రియాశీలకంగా ఉంటున్న మహిళలను ఆకర్షణీయ వస్తువుగా పేర్కొంటూ కించపరిచారు. పార్లమెంటులో మహిళలను ఇలా అవమానించడం ఆపండి’ అంటూ ఎంపీ ట్వీట్‌పై రేఖా శర్మ మండిపడ్డారు. శశిథరూర్‌ వ్యాఖ్యలపై అటు సుప్రీంకోర్టు న్యాయవాది కరుణా నందీ కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు. మహిళా ఎంపీల రూపంపై కామెంట్లు చేస్తూ.. విషయాన్ని తనవైపు కేంద్రీకరించుకొని ప్రయోజనం పొందేందుకే ఆయన ప్రయత్నించారని విమర్శించారు.

గుత్తా జ్వాలా స్పందన..

అయితే, నందీ ట్వీట్‌కు బదులిచ్చిన ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాలా.. కొన్ని విషయాలను తేలికగా తీసుకోవాలంటూ కరుణా నందీకి సూచించారు. ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడవద్దని.. పార్లమెంటులో మహిళా సభ్యులందరికి ఇదో అభినందనగా భావించాలనేది నా అభిప్రాయం అంటూ గుత్తా జ్వాలా పేర్కొన్నారు. అలాగే మీ పని ప్రదేశాన్ని ఆకర్షణీయంగా మార్చడానికి లోక్‌సభ మహిళా ఎంపీలు అలంకార వస్తువులు కాదంటూ మరో ట్విటర్‌ యూజర్‌ శశిథరూర్‌పై మండిపడ్డారు. మీలాగా వారు కూడా పార్లమెంట్‌ సభ్యులేనని.. అటువంటి వారిని అగౌరవపరుస్తూ మహిళల పట్ల వివక్షను ప్రదర్శిస్తున్నారంటూ విమర్శించారు.

ఇలా ట్విటర్‌లో తన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో స్పందించిన శశిథరూర్‌.. అందరం కలిసిన సందర్భంగా (మహిళా ఎంపీల చొరవతోనే) సరదాగా ఆ సెల్ఫీ తీసుకున్నాము. అదే స్ఫూర్తితో ఆ ఫొటోపై ట్విట్‌ చేయమని వారే నన్ను కోరారు. ఆ వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే నన్ను క్షమించండి. అయినప్పటికీ పని ప్రదేశంలో అలా చోటుచేసుకున్న సరదా సంభాషణలో పాల్గొనడం సంతోషంగా ఉంది’ అని తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ ట్విటర్‌లో మరోసారి బదులిచ్చారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని