Bharat Bandh: బంద్‌లో రైతన్నలు.. దిల్లీ సరిహద్దుల వద్ద భద్రత పెంపు

కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు నిరసనగా నేడు దేశవ్యాప్తంగా రైతు సంఘాలు భారత్‌ బంద్‌ను పాటిస్తున్నాయి. 40 రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్‌కేఎం) ఈ బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

Updated : 24 Sep 2022 16:31 IST

పలు రాష్ట్రాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం

(ప్రతీకాత్మక చిత్రం)

దిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు నిరసనగా నేడు దేశవ్యాప్తంగా రైతు సంఘాలు భారత్‌ బంద్‌ను పాటిస్తున్నాయి. 40 రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్‌కేఎం) ఈ బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అన్ని వర్గాలకు చెందిన ప్రజలు శాంతియుతంగా తమ ఆందోళనలో పాల్గొనాలని ఆదివారం ఎస్‌కేఎం విజ్ఞప్తి చేసింది. అలాగే ఈ బంద్‌కు కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఈ రోజు ఉదయం ఆరు నుంచి సాయంత్రం నాలుగు వరకు ఈ బంద్‌ కొనసాగనుంది. 

బంద్‌ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా దిల్లీలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వం బలగాలను మోహరించింది. రాజధాని సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. ఉత్తర్‌ ప్రదేశ్‌ నుంచి గాజిపూర్ వైపునకు రాకపోకలు సాగకుండా పోలీసులు రహదారులను మూసివేశారు. దాంతో దిల్లీ, ఉత్తరప్రదేశ్‌ మధ్య తిరిగే వాహనదారులకు అంతరాయం ఏర్పడింది. పంజాబ్, హరియాణా రాష్ట్రాల సరిహద్దుల్ని సాయంత్రం నాలుగు వరకు ముట్టడిస్తున్నట్లు రైతులు వెల్లడించారు. తమ ట్రాక్టర్లతో ప్రధాన రహదారుల్ని దిగ్బంధించారు. రైళ్ల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. యూపీ, పంజాబ్ ప్రభుత్వాలు ట్రాఫిక్ మళ్లింపు అడ్వైజరీని జారీ చేశాయి. బంద్‌ నడుస్తున్నప్పటికీ.. దిల్లీలో మాత్రం ప్రజా రవాణా కొనసాగుతోంది. మెట్రో సేవల్లో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. ఒడిశా బస్సు సేవల్ని నిలిపివేసింది. 


 

స్పందించిన రాహుల్‌, మాయావతి, ఇతర నేతలు..

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతోన్న రైతు సంఘాలకు పలువురు మద్దతు ప్రకటించారు. సోమవారం కాంగ్రెస్ నేత రాహుల్ మాట్లాడుతూ.. ‘రైతుల శాంతియుత సత్యాగ్రహం దృఢంగా సాగుతోంది. దోపిడీ ప్రభుత్వానికి ఇది నచ్చడం లేదు. అందుకే భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చాం’ అని అన్నారు. ఈ బంద్‌పై నిన్న మాయావతి ట్వీట్ చేశారు. ‘కేంద్రం హడావుడిగా తీసుకువచ్చిన చట్టాలను రైతన్నలు ఆమోదించలేదు. వాటి రద్దు కోసం గత 10 నెలలుగా దిల్లీ పరిసర ప్రాంతాల్లో నిరసన తెలుపుతూనే ఉన్నారు. ఇప్పుడు భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ శాంతియుత నిరసనకు బీఎస్పీ మద్దతు ఇస్తోంది’ అని అన్నారు. అలాగే పలు రాష్ట్రాల్లో విపక్ష నేతలు బంద్‌ పాటిస్తున్నారు. రైతులు శాంతియుతంగా తమ నిరసన స్వరాన్ని పెంచాలని పంజాబ్ నూతన ముఖ్యమంత్రి చరణ్‌జిత్ చన్నీ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని