US Corona: 8 లక్షల మరణాలు.. అదొక విషాదకరమైన మైలురాయి..!

అగ్రదేశం అమెరికాను కరోనా ముప్పుతిప్పలు పెట్టింది. ప్రస్తుతం అక్కడ వైరస్ విజృంభిస్తూనే ఉంది. దాంతో ఆ దేశంలో ఇప్పటివరకు ఐదు కోట్లకుపైగా కొత్త కేసులు.. 8 లక్షలకు పైగా మరణాలు సంభవించాయి.

Updated : 15 Dec 2021 14:39 IST

అమెరికాలో కరోనా ఐదో వేవ్‌.. 

మృతుల్లో ఎక్కువమంది టీకా తీసుకోనివారే

వాషింగ్టన్‌: అగ్రదేశం అమెరికాను కరోనా వణికిస్తోంది. ప్రస్తుతం అక్కడ వైరస్ మరోసారి విజృంభిస్తోంది. దాంతో ఆ దేశంలో ఇప్పటి వరకూ ఐదు కోట్లకుపైగా కొత్త కేసులు.. 8 లక్షలకు పైగా మరణాలు సంభవించాయి. మహమ్మారి వల్ల అత్యధిక మరణాలు ఈ దేశంలోనే నమోదయ్యాయని జాన్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ గణాంకాలు వెల్లడించాయి. అమెరికాలో నార్త్‌ డకోటా, అలస్కా వంటి రాష్ట్రాల జనాభా కంటే ఈ మృతుల సంఖ్యే ఎక్కువగా ఉండటం గమనార్హం. ‘8 లక్షల మరణాలు.. ఇదొక విషాదకరమైన మైలురాయి. కరోనా కారణంగా ఆత్మీయుల్ని కోల్పోయిన వారి కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాను. మనం ఇప్పుడు కొత్త వేరియంట్‌తో పాటు శీతకాలంలో ఉన్నాం. ఈ వైరస్‌తో పోరాడాలని మనం నిర్ణయించుకోవాలి’ అని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ మృతులకు నివాళి అర్పించారు.

ఆ దేశంలో 2020 డిసెంబర్‌లోనే టీకాలకు ఆమోదం లభించి, విరివిగా అందుబాటులోకి వచ్చినప్పటికీ.. 2021లో సుమారు 4,50,000 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువమంది టీకా తీసుకోనివారేనని అధికారిక సమాచారం వెల్లడించింది. పూర్తిస్థాయిలో టీకా తీసుకున్నవారితో పోలిస్తే.. టీకా తీసుకోని వారిలో కొవిడ్‌తో మరణం ముప్పు 14 రెట్లు ఎక్కువగా ఉందని పేర్కొంది. ఇప్పటివరకు ఆ దేశంలో 60 శాతం మంది పూర్తిస్థాయిలో టీకా వేయించుకున్నారు. అయితే ఈ విషయంలో ఇతర సంపన్న దేశాల కంటే అమెరికా వెనకబడే ఉంది. 

అమెరికాలో కరోనా ఐదో వేవ్‌..

ప్రస్తుతం అమెరికాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. అక్కడ పండగల సీజన్ నడుస్తోంది. ప్రజలంతా ఒక్కదగ్గర గుమిగూడుతున్నారు. దాంతో ఐదో దఫా కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. వాటికి ఒమిక్రాన్ వేరియంట్ తోడయింది. యూఎస్‌లో నమోదవుతోన్న మొత్తం కేసుల్లో అవి మూడు శాతం ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు లభించిన సమాచారం ప్రకారం.. ఈ  కొత్త వేరియంట్‌ వల్ల బాధితుల్లో స్వల్ప లక్షణాలు ఉన్నట్లు మాత్రమే తెలుస్తోంది. అయితే ఇది వేగంగా ప్రబలుతుండటం, టీకా సామర్థ్యాన్ని ఏమార్చుతుందనే నివేదికల కారణంగా తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ వేరియంట్ నుంచి రక్షణ పొందేందుకు 16 ఏళ్లు పైబడిన ప్రతిఒక్కరూ బూస్టర్‌ డోసు స్వీకరించాలని అక్కడి అధికారులు అభ్యర్థిస్తున్నారు.

టీకాలు వచ్చిన సంతోషంలో ఉన్న ప్రపంచానికి ఈ ఏడాది ప్రారంభంలో డెల్టా వేరియంట్ షాక్ ఇచ్చింది. ఇప్పటికీ ఆ ప్రమాదక వేరియంట్‌ ఉనికి చాటుతోంది. ఈ సమయంలో దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వెలుగుచూడటంతో అంతర్జాతీయంగా కలవరం మొదలైంది. కొద్దివారాల వ్యవధిలో 70కి పైగా దేశాలకు వ్యాపించింది. ఇదిలా ఉండగా.. కరోనా మరణాల పరంగా అమెరికా తర్వాతి స్థానంలో బ్రెజిల్‌ ఉంది. అక్కడ ఆరు లక్షలకు పైగా మరణాలు సంభవించాయి. భారత్‌లో 4.7 లక్షలు, రష్యాలో 2.9లక్షల మంది కరోనా కాటుకు బలయ్యారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని