Assembly Elections: ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. భారీ సభలులేనట్లేనా..?

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోన్న తరుణంలో దేశవ్యాప్తంగా కొవిడ్‌ ఉద్ధృతి మరోసారి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా నెలకొన్న కొవిడ్‌ పరిస్థితులను ఎన్నికల సంఘానికి వివరించేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు నేడు మరోసారి భేటీ అయ్యారు.

Updated : 06 Jan 2022 17:16 IST

కేంద్ర ఎన్నికల సంఘంతో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల భేటీ

దిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోన్న తరుణంలో దేశవ్యాప్తంగా కొవిడ్‌ ఉద్ధృతి మరోసారి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా నెలకొన్న కొవిడ్‌ పరిస్థితులను ఎన్నికల సంఘానికి వివరించేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు నేడు మరోసారి భేటీ అయ్యారు. ముఖ్యంగా ఒమిక్రాన్‌ ఉద్ధృతి, కొవిడ్‌ కేసులు భారీగా పెరుగుతున్న తీరును కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ బహిరంగ సభలు, ర్యాలీలకు అనుమతి ఇవ్వకూడదని సూచించినట్లు సమాచారం. మహమ్మారి విజృంభణ వేళ ఎన్నికల నిర్వహణకు ఈసీ సన్నద్ధం అవుతుండడంతో తాజా పరిస్థితులపై కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌తోపాటు నీతిఆయోగ్‌ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్‌ వీకే పాల్‌తో పాటు పలువురు ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించినట్లు సమాచారం.

దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతున్నప్పటికీ ఐదు రాష్ట్రాల ఎన్నికలను నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నద్ధం అవుతోంది. దీనిపై ఇప్పటికే స్పష్టతనిచ్చిన ఈసీ.. షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొంది. కరోనా నిబంధనలకు అనుగుణంగా పోలింగ్‌ ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో పర్యటించి పరిస్థితులను అంచనా వేసిన ఈసీ.. దేశవ్యాప్తంగా కొవిడ్‌ ఉద్ధృతిపైనా ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతోంది. కొన్ని రోజులుగా వైరస్‌ విజృంభణ మరింత పెరగడంతో కేంద్ర ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో తాజాగా మరోసారి భేటీ అయ్యింది. ఎన్నికల ప్రచారం, నిర్వహణ, కౌంటింగ్‌ సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర ఆరోగ్యశాఖ, కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ నుంచి పలు సూచనలు స్వీకరించినట్లు తెలుస్తోంది.

ఇదిలాఉంటే, ఉత్తరప్రదేశ్‌ సహా ఉత్తరాఖండ్‌, మణిపుర్‌, గోవా, పంజాబ్‌ రాష్ట్రాలకు మరికొన్ని నెలల్లోనే శాసనసభ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇందుకు సంబంధించి ఫిబ్రవరిలో నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే, గత కొన్ని రోజులుగా దేశంలో ఒమిక్రాన్‌ వ్యాప్తి పెరుగుతున్న దృష్ట్యా ఎన్నికలను వాయిదా వేయాలన్న డిమాండ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో పర్యటించిన ఈసీ.. అక్కడ అన్ని రాజకీయ పార్టీల నేతలతో భేటీ అయ్యింది. ఎన్నికలను వాయిదా వేయొద్దని పార్టీలు కోరాయని అందుకే ఉత్తరప్రదేశ్‌ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలను షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహించాలని నిర్ణయించినట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సుశీల్‌ చంద్ర ఇటీవలే వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని