
Children Vaccine: చిన్నారులకు కొవిడ్ టీకా.. త్వరలోనే 5 అందుబాటులోకి!
కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడి
దిల్లీ: దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దాదాపు 50శాతం అర్హులకు పూర్తి మోతాదులో (రెండు డోసుల్లో) టీకా అందించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇదే సమయంలో 18ఏళ్లలోపు చిన్నారులకు టీకా అందించేందుకూ ప్రభుత్వం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. 2 ఏళ్లు పైబడిన పిల్లల కోసం త్వరలోనే ఐదు వ్యాక్సిన్‌లు అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భాగంగా చిన్నారుల వ్యాక్సిన్‌లపై సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్రం ఈ సమాధానం ఇచ్చింది.
దేశంలో చిన్నారుల కోసం ఐదు వ్యాక్సిన్‌ల ప్రయోగాలకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) అనుమతి ఇచ్చిందని కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్ వెల్లడించారు. క్యాడిలా హెల్త్‌కేర్‌కు చెందిన జైడస్ క్యాడిలా, భారత్ బయోటెక్- కొవాగ్జిన్, సీరం ఇన్‌స్టిట్యూట్-కొవొవాక్స్, బయోలాజికల్ ఇ- ఆర్‌బీడీ, జాన్సన్ & జాన్సన్‌కు చెందిన Ad26COV2S వ్యాక్సిన్‌లు అనుమతి పొందిన వాటిలో ఉన్నాయని చెప్పారు. వీటిలో ఇప్పటికే కొన్ని ప్రయోగాలు పూర్తి చేసుకోగా.. మరికొన్ని తుదిదశకు చేరుకున్నాయని అన్నారు. నిపుణుల కమిటీ సమీక్ష అనంతరం ఇవి అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
జైకోవ్-డీ (ZyCoV-D): 12 ఏళ్ల వయసుపైబడిన పిల్లలపై జైకోవ్-డీ (డీఎన్‌ఏ ఆధారిత) టీకా ప్రయోగాలు పూర్తయ్యాయి. అత్యవసర వినియోగానికి ఇప్పటికే క్యాడిలా హెల్త్‌కేర్ అనుమతి పొందింది. ఇప్పటికే కోటి డోసులకు కేంద్రం ఆర్డరు చేసింది. తొలుత ఈ వ్యాక్సిన్‌ను మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, ఝార్ఖండ్, బిహార్‌తోపాటు పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో పంపిణీ చేయనున్నారు.
కొవాగ్జిన్ (Covaxin): 2 నుంచి 18ఏళ్ల పిల్లలకోసం కొవాగ్జిన్ టీకా రెండు/మూడోదశ ప్రయోగాలను భారత్ బయోటెక్ చేపట్టింది. వ్యాక్సిన్ భద్రత, రోగనిరోధకత సామర్థ్యానికి సంబంధించిన మధ్యంతర ఫలితాల సమాచారాన్ని ఇప్పటికే నియంత్రణ సంస్థలకు అందించింది.
కొవొవాక్స్ (COVOVAX): 2 నుంచి 17ఏళ్ల వయసు వారికోసం రూపొందించిన కొవొవాక్స్ తుది దశ ప్రయోగాలను సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చేపట్టింది. వీటిని దాదాపు 920 మంది వాలంటీర్లపై ప్రయోగిస్తున్నారు. వ్యాక్సిన్ ఉత్పత్తిని కూడా భారీస్థాయిలో చేపడుతున్నారు.
బయోలాజికల్ ఇ (RBD): 5 నుంచి 18ఏళ్ల మధ్యవయసు వారికోసం రూపొందించిన ఆర్‌బీడీ టీకాపై బయోలాజికల్-ఇ ప్రయోగాలు నిర్వహిస్తోంది. దాదాపు 624 మంది వాలంటీర్లపై తుదిదశ ప్రయోగాలు జరుగుతున్నాయి.
జాన్సన్ & జాన్సన్ (Ad26COV2S): 12 నుంచి 17ఏళ్ల వయసు పిల్లలకోసం జే&జే రూపొందించిన ‘Ad26COV2S’ టీకా రెండు/మూడో దశ ప్రయోగాలు కొనసాగుతున్నాయి. ఇలా చిన్నారుల కోసం రూపొందించిన ఐదు వ్యాక్సిన్‌లు వివిధ దశలో ఉన్నాయిని కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి వివరించారు.
ఇదిలాఉంటే, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 125 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను అందజేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వాటిలో 79.13కోట్ల (84శాతం) మంది అర్హులకు తొలిడోసు అందించగా.. 45.8కోట్ల (49శాతం) మందికి పూర్తి మోతాదులో వ్యాక్సిన్ అందించామని తెలిపింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.