
By-Elections: దేశవ్యాప్తంగా.. 30 అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాలకు ఉపఎన్నికలు
షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
దిల్లీ: దేశవ్యాప్తంగా కొవిడ్ తీవ్రత నియంత్రణలో ఉన్న నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 30 అసెంబ్లీ స్థానాలతో పాటు మూడు లోక్‌సభ సీట్లకు ఉపఎన్నిక నిర్వహణకు షెడ్యూల్ ప్రకటించింది. ఈ స్థానాల్లో అక్టోబర్ 30న ఎన్నికలు జరగనుండగా నవంబర్ 2న ఓట్ల లెక్కింపు చేపడుతారు.
మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా, హిమాచల్ ప్రదేశ్‌లోని మండీతో పాటు దాద్రా నగర్ హవేలీ లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నిక జరగనుంది. ఈ మూడు లోక్‌సభ స్థానాల్లోని సిట్టింగ్ అభ్యర్థులు ఈ మధ్యే ప్రాణాలు కోల్పోయారు. మండీ లోక్‌సభ ఎంపీ రామ్‌స్వరూప్ శర్మ(BJP) ఈ ఏడాది మార్చి నెలలో దిల్లీలోని ఆయన నివాసంలో మృతిచెందారు. మరో భాజపా ఎంపీ నంద్‌కుమార్ సింగ్ చౌహాన్ మృతి చెందడంతో ఖాండ్వా లోక్‌సభ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమయ్యింది. ఇక దాద్రా నగర్ హవేలీ స్వతంత్ర అభ్యర్థి మోహన్ డెల్కర్ అనుమానాస్పద స్థితిలో ముంబయిలో మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ ఉపఎన్నిక తప్పనిసరి అయ్యింది. ఈ మూడు లోక్‌సభ స్థానాలకు అక్టోబర్ 30న ఎన్నికలు జరుగనున్నాయి.
14 రాష్ట్రాల్లో 30 అసెంబ్లీ స్థానాలకు..
లోక్‌సభతో పాటు 14రాష్ట్రాల్లో 30శాసనసభ స్థానాల్లోనూ ఉపఎన్నికలు జరగనున్నాయి. అస్సాంలో ఐదు, పశ్చిమబెంగాల్‌లో నాలుగు, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయా రాష్ట్రాల్లో మూడు చొప్పున అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇక బిహార్, కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాల్లో రెండేసి అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నిక జరుగనుంది. ఆంధ్రప్రదేశ్, హరియాణా, మహారాష్ట్ర, మిజోరాం, నాగాలాండ్‌తో పాటు తెలంగాణ రాష్ట్రాల్లో ఒక్కో అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరుగనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఉపఎన్నికల నిర్వహణపై ఆయా రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి అభిప్రాయాలను తీసుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ముఖ్యంగా కరోనా వైరస్ విజృంభణ, వరదలు, పండుగలు, వాతావరణ పరిస్థితులకు సంబంధించి వాస్తవ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకొని వాటిపై సమీక్షించిన తర్వాతే ఉపఎన్నికలపై నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటనలో పేర్కొంది. నామినేషన్‌కు ముందు, తర్వాత ఊరేగింపులపై నిషేధం, ప్రచార కార్యక్రమాల్లో పరిమిత సంఖ్యలోనే కార్యకర్తలు, ప్రచారకర్తలను అనుమతించడం, ఎన్నికలకు 72గంటల ముందే ప్రచారాన్ని ముగించడం వంటి ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపింది.
ఇదిలాఉంటే, సెప్టెంబర్ 30వ తేదీన పశ్చిమ బెంగాల్‌లోని భవానీపూర్ అసెంబ్లీ స్థానంతో పాటు మరో మూడు స్థానాలకు ఉపఎన్నిక నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం సెప్టెంబర్ 4న ప్రకటించింది. పశ్చిమ బెంగాల్‌లో మరో రెండు (శంషేర్‌గంజ్, జంగీపూర్) అసెంబ్లీ స్థానాలు, ఒడిశాలోని పిప్లీ నియోజకవర్గానికి సెప్టెంబర్ 30న ఎన్నికలు జరుగనున్నాయి. అక్టోబర్ 3వ తేదీన వీటి కౌంటింగ్ జరుగనుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.