Mamata Banerjee: భవానీపూర్‌ నుంచే మమతా పోటీ..!

పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఏ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారనే ఉత్కంఠకు తెరపడింది. తృణమూల్‌కు కంచుకోటగా ఉన్న భవానీపుర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచే మమతా బెనర్జీ పోటీ చేస్తారని తృణమూల్‌ కాంగ్రెస్‌ వెల్లడించింది.

Updated : 05 Sep 2021 23:27 IST

3 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన తృణమూల్‌ కాంగ్రెస్‌

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఏ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారనే ఉత్కంఠకు తెరపడింది. తృణమూల్‌కు కంచుకోటగా ఉన్న భవానీపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచే మమతా బెనర్జీ పోటీ చేస్తారని తృణమూల్‌ కాంగ్రెస్‌ వెల్లడించింది. పశ్చిమ బెంగాల్‌లో సెప్టెంబర్‌ 30న జరగబోయే ఉపఎన్నికల్లో భాగంగా భవానీపూర్‌తోపాలు మరో రెండు అసెంబ్లీ స్థానాల్లో బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లను తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రకటించింది.

ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌ నెలల్లో పశ్చిమబెంగాల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌ నుంచి బరిలోకి దిగిన మమతా బెనర్జీ, ప్రత్యర్థి సువేందు అధికారి చేతిలో ఓటమిపాలయ్యారు. అయినప్పటికీ ముఖ్యమంత్రిగా మే 5న బాధ్యతలు స్వీకరించారు. దీంతో అప్పటినుంచి ఆరు నెలల్లోగా అనగా.. నవంబర్‌ 5వ తేదీలోగా శాసనసభకు ఎన్నిక కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మూడు స్థానాలకు సెప్టెంబర్‌ 3న ఉపఎన్నిక నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో భవానీపూర్‌ నుంచి పోటీ చేసేందుకు మమతా బెనర్జీ సిద్ధమయ్యారు. ఇక జంగీపుర్‌ నుంచి జాకీర్‌ హుస్సేన్‌, షంషేర్‌గంజ్‌ నుంచి అమిరుల్‌ ఇస్లాం పేర్లను తృణమూల్‌ కాంగ్రెస్‌ ఖరారు చేసింది. అయితే, మమతా బెనర్జీ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడానికి వీలుగా భవానీపూర్‌ నుంచి గెలుపొందిన శోభన్‌దేవ్‌ ఛటోపాధ్యాయ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న మూడు లోక్‌సభ స్థానాలు, 32 శాసనసభ స్థానాల ఎన్నికల నిర్వహణపై ఈనెల ఒకటో తేదీన ఆయా రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలు, సీఈవోలతో కేంద్ర ఎన్నికల సంఘం (EC) సమీక్ష జరిపింది. కొవిడ్‌ కేసుల తీవ్రత, వరదలు, పండగల నేపథ్యంలో తమ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉప ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని మెజారిటీ రాష్ట్రాల అధికారులు తెలియజేశారని ఈసీ వెల్లడించింది. అయితే, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లు మాత్రం ఉప ఎన్నికలు నిర్వహించేందుకు సుముఖత వ్యక్తం చేయడంతో ఆ రెండు రాష్ట్రాల్లో ఉపఎన్నిక జరుపుతామని ఈసీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఒడిశాలో పిప్లీ శాసనసభ సీటుతోపాటు పశ్చిమబెంగాల్‌లో 3 అసెంబ్లీ సీట్లకు సెప్టెంబర్‌ 30న ఉపఎన్నిక జరుగనున్నాయి. ఓట్ల లెక్కింపు అక్టోబరు 3న చేపడతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని