Turkey: టర్కీలో ధరల భగభగ.. ఆహారం కూడా కొనుక్కోలేని దుస్థితి

టర్కీలో ద్రవ్యోల్బణం తారస్థాయికి చేరడంతో ధరలు భగ్గుమంటున్నాయి. దీంతో ప్రజలు నిత్యావసర వస్తువులు సైతం కొనుక్కోలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు.......

Published : 03 Jan 2022 23:56 IST

దిల్లీ: టర్కీలో ద్రవ్యోల్బణం తారస్థాయికి చేరడంతో ధరలు భగ్గుమంటున్నాయి. దీంతో ప్రజలు నిత్యావసర వస్తువులు సైతం కొనుక్కోలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆ దేశంలో వార్షిక ద్రవ్యోల్బణం రేటు 19 ఏళ్ల రికార్డును చెరిపేస్తూ డిసెంబర్​ నాటికి 36.08 శాతానికి ఎగబాకింది. డిసెంబర్​లో వినియోగదారుల ధరల సూచీ అంతకుముందు నెలతో పోలిస్తే 13.58 శాతం మేర పెరిగిందని టర్కీ గణాంక సంస్థ ప్రకటించింది. ఆహార ధరల్లో వార్షిక పెరుగుదల 43.8 శాతంగా ఉందని పేర్కొంది. అయితే స్వతంత్రంగా పనిచేసే ‘ద్రవ్యోల్బణ పరిశోధన బృందం’ మాత్రం దేశంలో ద్రవ్యోల్బణం 83 శాతానికి చేరిందని తెలిపింది. వినియోగదారుల ధరల సూచీ అంతకుముందు నెలతో పోలిస్తే డిసెంబర్​లో 19.35 శాతం పెరిగిందని వివరించింది.

ప్రభుత్వ గణాంకాల ప్రకారం చూసినా.. 2002 సెప్టెంబర్​ తర్వాత అత్యధిక వార్షిక ద్రవ్యోల్బణం రేటు ఇదే. ఓ వైపు ధరలు భారీగా పెరుగుతుండటంతో టర్కీ కరెన్సీ ‘లిరా’ రోజురోజుకూ పతనమవుతోంది. అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగన్ ఒత్తిడితో కీలక వడ్డీ రేట్లపై ఆ దేశ సెంట్రల్ బ్యాంకు కోతలు విధించడంతో కరెన్సీ విలువ రికార్డు స్థాయిలో పడిపోయింది. తద్వారా దిగుమతులు కష్టతరమయ్యాయి. దీంతో వస్తువుల ధర భారీగా పెరిగింది. ఫలితంగా ప్రజల కొనుగోలు శక్తి మరింత క్షీణిస్తోంది.

డాలర్​తో పోలిస్తే గతేడాది లిరా 44 శాతం పతనమైంది. ఒక డాలరుకు 18.36 లిరాల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. దీంతో అధ్యక్షుడు ఎర్డోగన్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఆ తర్వాత కరెన్సీ కొంతవరకు కోలుకున్నప్పటికీ.. ఇప్పటికీ ఒత్తిళ్ల మధ్యే కొనసాగుతోంది. టర్కీలో 8.4 కోట్ల మంది నివసిస్తుండగా.. అందులో చాలా మంది కనీసం ఆహారం కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నారు. కొంతమంది తమ సేవింగ్స్​ను కాపాడుకునేందుకు విదేశీ కరెన్సీని, బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని