Aryan Khan case: ఆర్యన్‌ ఖాన్‌ కేసులో ట్విస్ట్‌: సంచలన ఆరోపణలు చేసిన సాక్షి!

ముంబయి డ్రగ్స్‌ వ్యవహారం కొత్తమలుపులు తిరుగుతున్నట్లు కనిపిస్తోంది.

Updated : 24 Oct 2021 15:22 IST

తోసిపుచ్చిన దర్యాప్తు సంస్థ ఎన్‌సీబీ

దిల్లీ: ముంబయి డ్రగ్స్‌ వ్యవహారం కొత్తమలుపులు తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ ఆపరేషన్‌కు నేతృత్వం వహించిన ఎన్‌సీబీ అధికారి సమీర్‌ వాంఖడేను టార్గెట్‌ చేస్తూ మహారాష్ట్ర మంత్రులు ఇప్పటికే ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై వాంఖడే ఇదివరకే దీటుగా బదులిచ్చారు. తాజాగా ఈ వ్యవహారంలో సాక్షిగా ఉన్న ప్రభాకర్‌ సెయిల్‌ అనే వ్యక్తి దర్యాప్తు సంస్థ ఎన్‌సీబీపైనే సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసులో పరారీలో ఉన్న గోసవీ-దర్యాప్తు సంస్థ మధ్య రహస్య ఒప్పందం, ముడుపుల వ్యవహారం నడుస్తోందనే అనుమానాలు వ్యక్తం చేస్తూ సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఈ డ్రగ్స్‌ కేసులో ఎన్‌సీబీ తనతో బ్లాంక్‌ పంచనామాపై బలవంతంగా సంతకం చేయించుకుందని ఆరోపించాడు.

షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ అరెస్టైన ముంబయి క్రూజ్‌ డ్రగ్స్‌ కేసులో తొమ్మిది మందిని ఎన్‌సీబీ సాక్షులుగా పేర్కొంది. వారిలో ప్రైవేట్‌ డిటెక్టివ్‌ కేపీ గోసవి కూడా ఒకరు. ఇందులో భాగంగా గోసవి బాడీగార్డుగా చెప్పుకుంటున్న ప్రభాకర్‌ సెయిల్‌ను ఎన్‌సీబీ విచారించింది. ఈ నేపథ్యంలోనే ప్రభాకర్‌ సెయిల్‌ ఎన్‌సీబీ దాడులతో పాటు ఈ డ్రగ్స్ వ్యవహారంపై సంచలన ఆరోపణలు చేశాడు. ఎన్‌సీబీ జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడే నుంచి ప్రాణాపాయం పొంచి ఉందని ఆరోపించారు. క్రూజ్‌పై దాడి జరిగిన తర్వాత ఎన్నో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నాడు. వీటికి సంబంధించిన వీడియోలు, ఆధారాలు తన దగ్గర ఉన్నాయంటూ నార్కొటిక్‌ డ్రగ్స్‌ కోర్టులో అఫిడవిట్‌ సమర్పించారు. దీంతో ఈ కేసు దర్యాప్తు మరిన్ని మలుపులకు దారితీయనున్నట్లు కనిపిస్తోంది. ఇదే సమయంలో ఆర్యన్‌ ఖాన్‌తో గోసవి దిగిన సెల్ఫీ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో ఆర్యన్‌కు గోసవికి మధ్య ఉన్న సంబంధంపై ఎన్‌సీబీ దృష్టిపెట్టింది. ప్రస్తుతం గోసవి పరారీలో ఉండడంతో ఆయనపై ఇప్పటికే పోలీసులు లుకౌట్‌ నోటీసులు జారీచేశారు.

మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్జేసేందుకే..
నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ)పై శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన వారి నుంచి ఎన్‌సీబీ డబ్బులు అడుగుతున్నట్లు తమ వద్ద సమాచారం ఉందని తెలిపారు. తెల్ల కాగితాలపై ఎన్‌సీబీ సాక్షుల సంతకాలు తీసుకుంటోందని రౌత్ ఆరోపించారు. దీనిపై పోలీసులు దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర హోంమంత్రి దిలీప్‌ వాల్సే పాటిల్‌ను కోరారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్జేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే భావిస్తున్నారని ట్వీట్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్‌ చేశారు. ఇందులో ఎన్‌సీబీ కార్యాలయంలో గోసవి ఆర్యన్‌ఖాన్‌ చేత ఫోన్లో మాట్లాడిస్తున్నట్లు ఉంది. 
ప్రభాకర్‌ సెయిల్‌ ఆరోపణలు చేసిన కాసేపటికే సంజయ్‌ రౌత్‌ ఈ ఆరోపణలు చేయడం గమనార్హం.

ఆరోపణలను తోసిపుచ్చిన ఎన్‌సీబీ..

గోసవి ఉద్యోగి చేసిన ఆరోపణలను ఎన్‌సీబీ తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ ముడుపుల వ్యవహారం జరిగితే కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఇంకా జైలులోనే ఎందుకుంటారు. దర్యాప్తు కార్యాలయంలో సీసీ కెమెరాలు ఉన్నాయని.. అటువంటి సంఘటనలు జరిగే ఆస్కారమే లేదు. కేవలం దర్యాప్తు సంస్థ ఇమేజ్‌ను దెబ్బతీయడానికి ఇటువంటి ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఎన్‌సీబీ అధికారులు స్పష్టం చేసినట్లు సమాచారం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని