Twitter: ట్విటర్‌ కొత్త ఐటీ నిబంధనలను ‘ప్రాథమికంగా’ పాటించింది!

కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన ఐటీ నిబంధనలను సోషల్‌మీడియా సంస్థ ట్విటర్‌ ‘ప్రాథమికంగా’ పాటించిందని కేంద్రం మంగళవారం దిల్లీ హైకోర్టుకు తెలిపింది.

Published : 10 Aug 2021 14:47 IST

దిల్లీ హైకోర్టుకు తెలిపిన కేంద్రం

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన ఐటీ నిబంధనలను సోషల్‌మీడియా సంస్థ ట్విటర్‌ ‘ప్రాథమికంగా’ పాటించిందని కేంద్రం మంగళవారం దిల్లీ హైకోర్టుకు తెలిపింది. చీఫ్‌ కాంప్లియెన్స్‌ ఆఫీసర్‌, రెసిడెంట్‌ గ్రీవెన్స్‌ ఆఫీసర్‌, నోడల్‌ కాంటాక్ట్‌ పర్సన్‌ను శాశ్వత ప్రాతిపదికన నియమించిందని పేర్కొంది.

నూతన ఐటీ నిబంధనలను ట్విటర్‌ పాటించడం లేదంటూ దాఖలైన పిటిషన్‌పై దిల్లీ హైకోర్టులో విచారణ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ చేతన్‌ శర్మ వాదనలు వినిపిస్తూ.. ‘‘నూతన చట్టాలకు అనుగుణంగా ట్విటర్‌ అధికారులను నియమించింది. అందుకు సంబంధించిన వివరాలను సంబంధిత సంస్థ ప్రతినిధులు నాకు మెయిల్‌ ద్వారా వెల్లడించారు’’ అని తెలిపారు. ఇందుకు జస్టిస్‌ రేఖా పల్లి స్పందిస్తూ.. దీనిపై రెండు వారాల్లోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించారు. ఆ అఫిడవిట్‌ను రికార్డ్‌ చేస్తామని తెలిపారు.

మరోవైపు ఈ విషయంపై ట్విటర్‌ కూడా వివరణ ఇచ్చింది. కోర్టు గడువు కల్పించడంతో సమస్యను పరిష్కరించుకున్నామని, శాశ్వత ప్రాతిపదికన అధికారులను నియమించామని వెల్లడించింది. ఈ మేరకు అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఈ అఫిడవిట్‌ను రికార్డు చేయనున్నట్లు కోర్టు తెలిపింది. దీనిపై తదుపరి విచారణను న్యాయస్థానం అక్టోబరు 5వ తేదీకి వాయిదా వేసింది. 

నూతన ఐటీ నిబంధనల అమలు విషయంలో ట్విటర్‌, కేంద్రం మధ్య విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఐటీ చట్టాలను పాటించనందుకు గానూ ట్విటర్‌ మధ్యవర్తి రక్షణ హోదా కూడా కోల్పోయింది. దీంతో పలు రాష్ట్రాల్లో సంస్థ ప్రతినిధులపై కేసులు నమోదయ్యాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని