
Stand-up comedy: వీర్‌దాస్.. కామెడీ పేరుతో పరువు తీస్తున్నావు?
‘టూ ఇండియాస్’ ప్రదర్శనపై మండిపడ్డ భాజపా
దిల్లీ: ప్రముఖ స్టాండప్ కమెడియన్ వీర్‌దాస్ ‘డ్యుయల్ ఇండియా (Dual India)’ పేరుతో వ్యంగ్యంగా చేసిన ఓ ప్రదర్శన సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యింది. ముఖ్యంగా విదేశీ నేలపై భారత్‌ను అవమానపరిచారంటూ కొందరు తీవ్ర విమర్శలు చేస్తుండగా.. మరికొందరు మాత్రం ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం ఉందంటూ మద్దతు పలుకుతున్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించిన భాజపా.. దిల్లీ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. ఇక కాంగ్రెస్‌లో కొందరు నాయకులు వీర్‌దాస్ ప్రదర్శనను ఖండించగా.. మరికొందరు మాత్రం ఆయన వాస్తవాలే చెప్పారంటూ మద్దతు పలుకుతున్నారు.
అమెరికా పర్యటనలో ఉన్న కమెడియన్ వీర్‌దాస్.. వాషింగ్టన్లో ఉన్న జాన్ ఎఫ్ కెన్నడీ సెంటర్లో ఈమధ్యే ఓ ప్రదర్శన (Stand-up Comedy) ఇచ్చారు. అందులో భాగంగా భారత్‌లో కరోనా వైరస్, అత్యాచారాలు, మహిళా స్వేచ్ఛతో పాటు పలు అంశాలను రెండు కోణాల్లో ప్రస్తావిస్తూ వ్యంగ్యంగా వివరించారు. ‘ఐ కమ్ ఫ్రమ్ టూ ఇండియాస్ (I Come From Two Indias)’ అనే పేరుతో రూపొందించిన ఈ వీడియోను యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారు. ఆ వీడియోలో కొన్ని భాగాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా పగలు మహిళలను పూజిస్తూ.. రాత్రివేళల్లో గ్యాంగ్ రేప్‌లకు పాల్పడే దేశం నుంచి వచ్చానంటూ వీర్‌దాస్ చెప్పడం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇదే సమయంలో భారత్ ఎదుర్కొంటున్న భిన్న సమస్యలను విదేశాల్లో ప్రస్తావిస్తూ వ్యంగ్యంగా మాట్లాడడం ఎంతోమంది మనోభావాలను దెబ్బతీయడమేనని విమర్శిస్తున్నారు. మరికొందరు మాత్రం ఆయన చెప్పిన విషయాలతో ఏకీభవిస్తున్నారు. ఇలా వీర్‌దాస్ కామెడీ షోపై రాజకీయ పార్టీలు, సామాన్యుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.
దేశాన్ని అవమానిస్తే సహించేది లేదు..
భారత్‌ను అవమానపరుస్తూ వీర్‌దాస్ అమెరికాలో ప్రదర్శన ఇచ్చారని ఆరోపిస్తూ దిల్లీ భాజపా నేత ఆదిత్య ఝా పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీర్దాస్ను అరెస్టు చేసేవరకు పోరాడుతానన్న ఆయన.. విదేశీ నేలపై భారత్‌ను అవమానిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ఆదిత్యతోపాటు పలువురు నేతలు వీర్‌దాస్ షోను తప్పుపట్టారు.
కాంగ్రెస్ నాయకుల మిశ్రమ స్పందన..
వీర్‌దాస్ షోను కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ తీవ్రంగా ఖండించారు. కొంతమంది వ్యక్తులు చేసే దుర్మార్గాలను దేశం మొత్తం అన్వయిస్తూ చెప్పడం సరికాదన్నారు. వలస పాలనలో పాశ్చాత్య దేశాల ముందు భారత్‌ను తప్పుగా చిత్రీకరించే ఉనికి ఇంకా పోలేదని తెలుస్తుందన్నారు. దీనిపై స్పందించిన కాంగ్రెస్ నేత శశిథరూర్ మాత్రం వీర్‌దాస్‌కు మద్దతు తెలిపారు. స్టాండప్ కమెడియన్‌గా పేరొందిన వీర్‌దాస్‌కు ‘స్టాండ్ అప్’ అంటే కేవలం భౌతికంగా నిలబడడం మాత్రమే కాదని.. దానిలో ఉన్న నైతికత కూడా ఆయనకు తెలుసునని ప్రశంసించారు. ఇది కేవలం కామెడీ మాత్రమేనని.. ఎగతాళి మాత్రం కాదని శశిథరూర్ చెప్పుకొచ్చారు. ఇక వీర్‌దాస్‌కు మరో కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ మద్దతు తెలిపారు.
ఈ ప్రదర్శనపై వివాదం చెలరేగడంతో కమెడియన్ వీర్‌దాస్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. దేశాన్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదని.. ఇది కేవలం వ్యంగ్యంలో భాగం మాత్రమేనని ట్విటర్లో వివరణ ఇచ్చారు.