Aryan khan: మొదటిసారి పెదవి విప్పిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి

డ్రగ్స్‌ కేసులో బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ అరెస్టుపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే మొదటిసారి పెదవి విప్పారు. డ్రగ్స్ ఒక్క మహారాష్ట్రలోనే దొరికాయా..? ముంద్రా పోర్టులో దొరికిన వాటి సంగతేంటి..? అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అలాగే తమ ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నాలు మానుకోవద్దంటూ సవాలు విసిరారు. దసరా సందర్భంగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పలు వ్యాఖ్యలు చేశారు. 

Published : 17 Oct 2021 01:57 IST

భాజపాపై విమర్శలు గుప్పించిన ఉద్ధవ్‌ ఠాక్రే

ముంబయి: డ్రగ్స్‌ కేసులో బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ అరెస్టుపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే మొదటిసారి పెదవి విప్పారు. డ్రగ్స్ ఒక్క మహారాష్ట్రలోనే దొరికాయా..? ముంద్రా పోర్టులో దొరికిన వాటి సంగతేంటి..? అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అలాగే తమ ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నాలు మానుకోవద్దంటూ సవాలు విసిరారు. దసరా సందర్భంగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పలు వ్యాఖ్యలు చేశారు. 

‘డగ్స్‌ను మహారాష్ట్రలో మాత్రమే స్వాధీనం చేసుకున్నారా? ముంద్రా పోర్టులో కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్‌ దొరికాయి. మీ ఏజెన్సీలు చిటికెడు గంజాయిని పట్టుకుంటుంటే.. మా పోలీసులు రూ.150 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. సెలబ్రిటీలను అదుపులోకి తీసుకొని, ఫొటోలు దిగడం పట్లే మీకు ఆసక్తి ఉంది. వచ్చే నెల మా సంకీర్ణ ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఇప్పటికే పలు మార్లు మా ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నాలు జరిగాయి. మీ ప్రయత్నాలు మానుకోకండి’ అంటూ భాజపాను ఉద్దేశించి ముఖ్యమంత్రి సవాలు విసిరారు. మహారాష్ట్రపై భాజపా దుష్ర్పచారం చేస్తోందని ఆరోపించారు. ‘వారు ముంబయి పోలీసుల్ని మాఫియా అని పిలుస్తారు. మరి యూపీ పోలీసుల్ని ఏమని పిలవాలి?’ అంటూ విమర్శలు గుప్పించారు. 

భారతీయులందరి పూర్వీకులంతా ఒకరేనని ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్ భగవత్ చేసిన ప్రకటనను ఠాక్రే ప్రస్తావించారు. ‘ప్రతిపక్ష పార్టీనేతలు, రైతుల పూర్వీకులు వేరే గ్రహం నుంచి వచ్చారా? అధికారం కోసం చేసే ఈ ప్రయత్నాలు సరికాదు. అధికార కోసం తాపత్రయం వ్యసనం లాంటిది. డ్రగ్స్ వ్యసనంగా మారితే అది మిమ్మల్ని, మీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది. అదే అధికారం కోసం ఆరాటం ఇతరుల కుటుంబాలను నాశనం చేస్తుంది’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

కొద్ది రోజుల క్రితం ముంబయి తీర ప్రాంతంలో క్రూజ్ నౌక ఘటనలో ఆర్యన్‌ ఖాన్‌ సహా మరికొంతమందిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అదుపులోకి తీసుకుంది. ఆ ఘటనలో ఆర్యన్‌కు ఇప్పటివరకు బెయిల్ దొరకలేదు. ఈ వ్యవహారంపై మహారాష్ట్ర ప్రభుత్వం గుర్రుగా ఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని