Queen Elizabeth: ఎలిజబెత్ రాణికి మళ్లీ అనారోగ్యం.. కీలక కార్యక్రమానికి దూరం!

బ్రిటన్ మహారాణి ఎలిజబెత్​-2 (95) మరోసారి అనారోగ్యం బారినపడ్డారు. దీంతో కీలక సంస్మరణ కార్యక్రమానికి హాజరుకావడంలేదు.....

Updated : 15 Nov 2021 11:50 IST

లండన్‌: బ్రిటన్ మహారాణి ఎలిజబెత్​-2 (95) మరోసారి అనారోగ్యం బారినపడ్డారు. దీంతో కీలక సంస్మరణ కార్యక్రమానికి హాజరుకావడంలేదు. కొద్ది కాలంగా సమావేశాలకు దూరంగా ఉంటున్న ఆమె.. అనారోగ్యం కారణంగా రెండో ప్రపంచ యుద్ధ సంస్మరణ కార్యక్రమానికి కూడా దూరంగా ఉంటున్నట్లు బకింగ్​హామ్ ప్యాలెస్ ఓ ప్రకటనలో తెలిపింది. వెన్ను నొప్పి కారణంగా సెంట్రల్​ లండన్​లో జరిగే ఈ సంస్మరణ కార్యక్రమానికి హాజరుకావడం లేదని పేర్కొంది. ఇందుకు ఆమె ఎంతగానో చింతిస్తున్నట్లు ప్యాలెస్ అధికారులు తెలిపారు. అయితే రాజకుటుంబంలోని మిగతా సభ్యులు మాత్రం కార్యక్రమానికి హాజరవుతున్నారు.

ఈసారి కూడా కుమారుడే..

వైద్యుల సూచన మేరకు కొంతకాలంగా బహిరంగ కార్యక్రమాల్లో ఎలిజబెత్ రాణి పాల్గొనడం లేదు. అయితే చాలా రోజుల తర్వాత ఆమె పాల్గొనే తొలి కార్యక్రమం ఇదే అవుతుందని అంతా భావించారు. కానీ ఇంతలోనే మళ్లీ అనారోగ్యానికి గురయ్యారు. అయితే మునుపటిలా సంస్మరణ కార్యక్రమంలో ఎలిజబెత్ తరఫున ఆమె కుమారుడు ప్రిన్స్ చార్లెస్‌ పుష్పగుచ్ఛం సమర్పిస్తారని అధికారులు తెలిపారు. రెండో ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరించుకుంటూ ఏటా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఆ యుద్ధ సమయంలో ఎలిజబెత్ ఆర్మీ డ్రైవర్​గా సేవలందించారు. అయితే ఆమె హాజరుకాకపోయినా.. రాజవంశ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అధికారులు స్పష్టం చేశారు.

ఏడాది గడిస్తే 70 ఏళ్లు

గత నెలలో వైద్య పరీక్షల నిమిత్తం ఎలిజబెత్ ఒక్కరోజు లండన్​లోని ఆస్పత్రిలో ఉన్నారు. ఆమె రెండు వారాల పాటు బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచించినట్లు బకింగ్​హామ్ ప్యాలెస్ అక్టోబర్​ 29న ప్రకటన విడదుల చేసింది. అందుకే గ్లాస్గోలో జరిగిన ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సుకు హాజరుకాలేదు. వీడియో సందేశమే ఇచ్చారు. విశ్రాంత సమయంలో ఎలిజబెత్​ ఇంటి నుంచే పనిచేస్తున్నారు. ఎక్కువకాలం జీవించి, పాలించిన బ్రిటన్ రాణిగా ఘనత సాధించిన ఎలిజబెత్ 2.. వచ్చే ఏడాది ప్లాటినం జూబ్లీ వేడుకలు జరుపుకోనున్నారు. సింహాసనాన్ని అధిష్ఠించి 70 ఏళ్లు పూర్తి చేసుకోనున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని