Published : 21 Sep 2021 01:33 IST

China-US Cold War: ఇలాగే కొనసాగితే.. ప్రచ్ఛన్న యుద్ధమే..!

హెచ్చరించిన ఐక్యరాజ్యసమితి

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికా, చైనాల మధ్య ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు మరికొంత కాలం కొనసాగితే భవిష్యత్తులో ప్రచ్ఛన్న యుద్ధం (Cold War) సంభవించే ప్రమాదం ఉందని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. అది రెండు దేశాలతోపాటు ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం చూపించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. అందుకే అలాంటి పరిస్థితులను నివారించడానికి.. రెండు అతిపెద్ద, శక్తివంతమైన దేశాలు తమ సంబంధాలను చక్కబెట్టుకోవాలని విజ్ఞప్తి చేసింది. ప్రపంచ దేశాల నేతలు ఒకే వేదికపైకి వచ్చే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల నేపథ్యంలో ఐరాస ఈ విధంగా స్పందించింది.

‘ప్రపంచంలో పెద్ద ఆర్థికశక్తులుగా ఉన్న రెండు దేశాలు వాతావరణ మార్పులు, వాణిజ్యం, సాంకేతికతలే కాకుండా మానవ హక్కులు, ఆర్థిక వ్యవస్థ, ఆన్‌లైన్‌ భద్రత, దక్షిణ చైనా సముద్రం సార్వభౌమత్వం విషయంలో ఇరు దేశాలు సహకారం అందించుకోవాలి. కానీ, దురదృష్టవశాత్తు ప్రస్తుతం ఆ రెండు దేశాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణ నెలకొంది. ఇది మరింత ముదరకముందే రెండు దేశాలు తిరిగి వాటి సంబంధాలను మెరుగుపరచుకోవాలి’ అని ఐక్యరాజ్య సమితి సెక్రటరి జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ సూచించారు. ఇవే కాకుండా వ్యాక్సినేషన్‌, వాతావరణ మార్పులతో పాటు ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం కూడా ఎంతో ముఖ్యమన్నారు. శక్తివంతమైన దేశాల మధ్య నిర్మాణాత్మక సంబంధాలు లేకుండా అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కోవడం సాధ్యం కాదని గుటెరస్‌ అభిప్రాయపడ్డారు.

అమెరికా, చైనా దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు క్షీణించడం, ఆర్థిక నిబంధనలు, పోటాపోటీ మిలటరీ వ్యూహాలను చూస్తే రానున్న రోజుల్లో ప్రపంచం రెండుగా చీలిపోయే ముప్పు ఉందని ఐరాస చీఫ్‌ రెండేళ్ల క్రితమే హెచ్చరించారు. అయినప్పటికీ ఇరు దేశాల సంబంధాల్లో మార్పు రాలేదు. ఇదే విషయాన్ని మరోసారి ఉద్ఘాటించిన ఆంటోనియా గుటెరస్‌.. వీలైనంత తొందరగా ఇరు దేశాల మధ్య సంబంధాలను చక్కబెట్టుకోవాల్సి ఉందని హితవు పలికారు. రానున్న రోజుల్లో ఇవి మరింత ఎక్కువై ప్రచ్ఛన్న యుద్ధంగా మారితే అత్యంత ప్రమాదకరమైన, నియంత్రించలేని పరిస్థితులు ఏర్పడే ప్రమాదముందని హెచ్చరించారు. అందుకే అలాంటి వాతావరణాన్ని అన్నివిధాలా నివారించడమే ఎంతో కీలకమని స్పష్టం చేశారు. వీటితో పాటు అఫ్గానిస్థాన్‌లో తాజాగా నెలకొన్న పరిస్థితులపైనా ఐరాస చీఫ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడి సంక్షోభాన్ని తొలగించడంలో భాగంగా అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని